Nara Lokesh Yuvagalam Padayatra

యువగళంతో జనసంద్రంగా మారిన అనంతపురం! అడుగడుగునా యువనేతకు జననీరాజనం రోడ్లవెంట బారులు తీరిన యువతీయువకులు నేడు ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర

అనంతపురం: అరాచకపాలనపై పోరు సాగించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh అనంతపురంలో చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలతో స్వాగతం పలుకడంతో అనంతపురం జనసంద్రంగా మారింది. అనంతపురంలో ఆరుగంటలపాటు పాదయాత్ర కొనసాగింది. దారిపొడవునా విచిత్ర వేషధారణలు, డప్పుల శబ్ధాలు, బాణసంచా మోతలతో పాదయాత్ర హోరెత్తింది.  అనంతపురం ప్రజలు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. అడుగడుగునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్య విన్నవించారు. లోకేష్ కు సంఘీభావంగా పెద్దఎత్తున యువకులు, మహిళలు పాదయాత్రలో అడుగులు వేశారు. అనంతపురం విజయనగర్ కాలనీలో నిర్వహించిన యువనేత బహిరంగసభకు పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. బహిరంగసభ అనంతరం జ్యోతిరావ్ పూలే సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, పవర్ హౌస్ సర్కిల్, బసన్నగుడి, విజయ క్లాత్ సెంటర్, సూర్యనగర్, సప్తగిరి సర్కిల్, చర్చి సర్కిల్, శివరామకృష్ణ సర్కిల్, గవర్నమెంట్ హాస్పటల్, రుద్రంపేట బైపాస్, నూర్ బాషా ఫంక్షన్ హాలు, కళ్యాణదుర్గం సర్కిల్, నారాయణపురం ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ మీదుగా పిల్లిగుండ్ల ఎంవైఎస్ కళ్యాణ మండపం వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11గంటలవరకు 7గంటలపాటు అనంతపురం నగరం యువగళం పాదయాత్ర కొనసాగింది.

బిసిలకు అడగడుగునా వేధింపులే!

వైసీపీ పాలనలో బిసిలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వైసీపీ నేత‌ల ఒత్తిడితో పోలీసులు కేసు కూడా న‌మోదు చేయ‌లేదు. దీంతో ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బీసీలకు 10శాతం రిజర్వేషన్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గించాడు. దీంతో 16వేల మందికి పదవులు పోయాయి. ప్రశ్నించిన బీసీలపై 26వేల అక్రమ కేసులు పెట్టారు. అందుకే టీడీపీ పాలనలో బీసీలకు అట్రాసిటీ చట్టాన్ని తెస్తాం. వాళ్లపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేస్తాం. మైనారిటీలను కూడా వదల్లేదు. చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా మైనారిటీలపై దాడులు జరిగాయా? లేదు. ఆత్మహత్యలు చేసుకున్నారా?  రంజాన్ వస్తే రంజాన్ తోఫా, మసీదుల రంగులకు డబ్బులు, హజ్ యాత్రకు డబ్బులు, ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి మైనారిటీలకు పెద్దపీఠ వేసిన ఘనత చంద్రబాబుది.

రైతులను కోలుకోలేని దెబ్బతీశాడు!

రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానన్నాడు. ఇన్ పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ అన్నీ నిలిపేశాడు. రైతు మెడకు ఉరితాళ్లను మోటార్లకు మీటర్లతో బిగిస్తున్నాడు. రైతులెవరూ మోటార్లకు మీటర్లు పెడితే ఊరుకోవద్దు. వాటిని పగలకొట్టండి… మీకు మేం అండగా ఉంటాం. టమాటా, చీనీ, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యతను మేం తీసుకుంటాం. సబ్సిడీపై గతంలో ఇచ్చిన విధంగా డ్రిప్ ను కూడా టీడీపీ అధికారంలోకి వచ్చాక అందిస్తాం. వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు. సీపీఎస్ రద్దు చేస్తానని నేటికీ చేయలేదు. పోలీసులను కూడా మోసం చేశాడు. వాళ్లకు టీఏ, డీఏ, సరెండర్లు, మెడికల్ రీయింబర్స్ మెంట్ ను ఇవ్వకుండా నిలిపేశాడు.

టిడిపిపై వాలంటీర్లతో తప్పుడు ప్రచారం

వాలంటీర్ వాసు ని పంపి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. వాలంటీర్లు మీ ఇంటికి  వచ్చి TDP గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే టిడిపి బ్రదర్. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ నీది. జగన్ పాలనలో అన్న క్యాంటీన్, పండుగ కానుకలు, పెళ్లికానుక, చంద్రన్న బీమా, ఫీజు రీయింబర్స్ మెంట్, డ్రిప్ ఇరిగేషన్, కార్పొరేషన్ సబ్సిడీలోన్లు ఇలా 100కు పైగా సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశాడు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం గా జగన్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించొచ్చు.

ఇద్దరు రాష్ట్రపతులను అందించిన నేల అనంతపురం

అనంతపురం విద్యావంతులకు పుట్టినిల్లు, రాజకీయ చైతన్యానికి మారుపేరు. ఎస్కే యూనివర్సిటీ, సత్యసాయి యూనివర్సిటీ లను పోరాడి సాధించుకున్న చరిత్ర అనంతపురం ప్రజలది. ఇక్కడ చదువుకున్న దళిత నేత దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఎదిగారు.  ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఎదిగారు. నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి గా ఎదిగారు. అంతటి ఘన చరిత్ర ఉన్న అనంతపురంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

మహిళల మాంగల్యాలు తాకట్టు పెట్టాడు!

మహిళల జీవితాలను అగాధంలోకి నెడుతున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. వైసీపీ పరిపాలన లో పురుగుల మందులు పనిచేయవు. ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. అవి ఏంటో తెలుసా గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్.

మేం తెచ్చిన రోడ్డుకు అనంత కమీషన్లు

పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు అర్బన్ లింక్ రోడ్డును టిడిపి హయాంలోనే మంజూరు చేయించాం. అప్పట్లో కేంద్రమంత్రి గడ్కరీకి ఒప్పించి రోడ్డు శాంక్షన్ చేయించాం. అర్బన్ లింక్ రోడ్డు నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే  తన జేబు నింపుకోవడం కోసం ఉపయోగించుకున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ నుంచి 10 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు. దీంతోపాటు రోడ్డు విస్తరణలో తమకు అనుకూలంగా ఉండే వారి ఇళ్లు, షాపులు పోకుండా రోడ్డును అష్టవంకరలు తిప్పారు.  సప్తగిరి సర్కిల్ వద్ద రోడ్డును పరిశీలిస్తే ఒకే దగ్గర నాలుగైదు వంకరలు తిరిగింది. ఇదంతా తమ అనుచరులు తమ నాయకుల ఆస్తులు పోకుండా ఉండడం కోసం ఎమ్మెల్యే చేసిన అరాచకం. ఇదే కాకుండా రోడ్డు విస్తరణలో షాపులు ఇల్లు పోకుండా ఉండడం కోసం యజమానుల నుంచి కోట్లల్లో వసూలు చేశారు. ఈయన అరాచకాలపై ఓ రిటైర్డ్ ఏఎస్పి సీఎంకు లేఖ కూడా రాసారు.  గతేడాది అనంతపురం నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రెండు వేల ఇల్లు నీట మునిగాయి. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా?  నగరం మధ్యలో వెళ్లే వాగులు వంకల్ని వైకాపా నాయకులు కబ్జా చేసి ఇళ్లు కట్టేశారు. 40 అడుగులు ఉండాల్సిన నడిమి వంక 10 అడుగులకు కుదించుకుపోయింది. దీనివల్ల వరదలు వంకను రెండు వైపులా ఉన్న కాలనీలను ముంచెత్తింది.

టిడిపి హయాంలోనే అనంత అభివృద్ధి!

అనంతపురం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానని 10 ఏళ్ల క్రితం ఈ వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. రింగ్ రోడ్డు ఎక్కడ కట్టాడో కనిపించడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో లేబర్ కాంట్రాక్టర్ నుండి ప్రతి నెలా ఐదు లక్షల ముడుపులు తీసుకుంటున్నాడు కమిషన్ ఎమ్మెల్యే. టిడిపి హయాంలో 6 వేల టిడ్కొ ఇళ్ళు నిర్మాణం చేపట్టాం. వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వకుండా వేధిస్తున్నారు మీ కమిషన్ ఎమ్మెల్యే. అనంతపురం టిడిపి హయాంలో మాత్రమే అభివృద్ధి చెందింది. 91 కోట్లతో పైపులైను, 11 రిజర్వాయర్లు నిర్మాణం చేసి మరో 20 ఏళ్ళు అనంతపురం నగరానికి నీటి సమస్య లేకుండా చేసాం. సంజీవరెడ్డి స్టేడియం ని అభివృద్ధి చేసాం.  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసింది టిడిపి. నగరంలో పేదలకు ఇళ్ళు కట్టింది,  రోడ్లు వేసింది, మొక్కలు నాటింది కూడా టిడిపి హయాంలోనే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి సిటీ ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం. టిడిపి అధికారంలోకి రాగానే 12 వేల టిడ్కొ ఇళ్ళు పంపిణి చేస్తాం. కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. గుత్తి రోడ్ లోని డంపింగ్ యార్డ్ ను మరో ప్రాంతానికి తరలిస్తాం. నగరంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం. రాబోయే ఎన్నికల్లో టిడిపిని ఆశీర్వదించండి.

ఆర్ డిటి కార్యాలయాన్ని సందర్శించిన యువనేత లోకేష్ అనంతపురంలో ఆర్ డిటి సేవలు స్పూర్తిదాయకం అధికారంలోకి వచ్చాక ఆ సంస్థతో కలసి మహిళాభివృద్ధికి కృషిచేస్తాం

అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ డిటి) కార్యాలయాన్ని యువనేత లోకేష్ సందర్శించారు. ఆర్డిటి వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ కి నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఆర్డిటి కార్యాలయంలోకి లోకేష్ ని విన్సెంట్ ఫెర్రర్ కుమారుడు మాంచు ఫెర్రర్, ఆయన సతీమణి విశాల ఫెర్రర్ సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డిటి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని యువనేత కొనియాడారు. 1969లో ఎన్నో అవమానాలు ఎదురైనా పేదలకు సేవలు అందించాలనే ధృడ సంకల్పంతో  విన్సెంట్ ఫెర్రర్ గారు చేసిన కృషి చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఆర్డిటి రాయలసీమ వ్యాప్తంగా 3 వేల గ్రామాల్లో సేవలు అందిస్తోంది. ఆసుపత్రులు నిర్మాణం, ఆర్ధిక సహాయం, ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, చెక్ డ్యాం ల నిర్మాణం, గ్రామాల్లో త్రాగునీటి సదుపాయం ఇలా అనేకరకాలుగా ఆర్ డిటి సేవలదిస్తోంది. ఇప్పటివరకు వేల కోట్లు ఖర్చు చేసి పేదలకు సేవలు అందించడం గొప్ప విషయం. అనంతపురం జిల్లాలో ఆర్డిటి సహాయం పొందని కుటుంబం అంటూ ఉండదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్డిటి సేవలు మరింత విస్తరించే విధంగా కలిసి పనిచేస్తాం. గ్రామీణులకు ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కల్పన కోసం ఆర్డిటి సేవలు వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పడం ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రణాళిక సిద్దం చేసుకొని ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తాం. మహిళల పట్ల ఉన్న చులకన భావం, మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించడం కోసం ఆర్డిటి ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల అభివృద్ది కోసం ఆర్డిటి తో కలిసి పనిచేస్తామని లోకేష్ పేర్కొన్నారు.

యువనేతను కలిసిన రజక, వాల్మీకి సామాజికవర్గీయులు

అనంతపురం జ్యోతిరావ్ పూలే సర్కిల్ లో అనంతపురం జిల్లా రజకసామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. రజకులు కడు పేదరికంలో ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఎస్సీ జాబితాలో చేర్చాలి. రజకులకు నియోజకవర్గాల వారీగా కళ్యాణ మండపాలు, మండలాలవారీగా కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆధునిక యంత్రాలతో మోడ్రన్ దోబీ ఘాట్ లు నిర్మించాలి. లాండ్రీ వర్కర్లు, డ్రైక్లీనింగ్ షాపులకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయాలి. 50సంవత్సరాలు నిండిన రజకులకు పింఛను మంజూరు చేయాలి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో రజకులతోపాటు బిసిలకు ముఖ్యమంత్రి  తీరని ద్రోహం చేశారు. బిసిలకు కుర్చీల్లేని కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఒక్కరూపాయి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు. టిడిపి హయాంలో ఆదరణ పథకం కింద రజకులకు వాషింగ్ మెషీన్లు అందజేశాం. రాబోయే టిడిపి ప్రభుత్వంలో రజకులకు వాషింగ్ మెషీన్లతోపాటు వృత్తిపని చేసుకునేందుకు వీలుగా నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక నిలిపివేసిన కమ్యూనిటీ హాలు భవనాల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం.  రజకులకు అధునాతన యంత్రాలతో సమీకృత దోబీఘాట్లు నిర్మిస్తాం. రజకులకు దామాషా పద్ధతిన నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు అందజేస్తాం. సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా వాల్మీకిలకు న్యాయం చేస్తాం.

యువనేతను కలిసిన ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గీయులు

అనంతపురం అంబేద్కర్ సర్కిల్ లో  అనంతపురం జిల్లా ఎస్సీ,ఎస్టీ సామాజికవర్గీయులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించి వైసిపి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తోంది. అందరికీ ఇచ్చే పథకాలతో సంబంధం లేకుండా సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి మాత్రమే ఖర్చుచేయాలి. అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను పునరుద్దరించి ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు గ్రూప్-1, గ్రూప్-2, పోలీసు, టీచర్ పోస్టుల పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇప్పించాలి. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందజేయాలి. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు, వాహనాల కొనుగోలుకు ఎన్ఎస్ఎఫ్ డిసి ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ కళాశాలలు నిర్మించాలి. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునరుద్దరించాలి. దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యచారాలను నిరోధించాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

దళితులకోసం గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన దళితులు, గిరిజనులపై దాడులకు తెగబడుతున్నారు. గత నాలుగేళ్లలో రూ.28వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్, 5,400 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి తీరని అన్యాయం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యంచేసి ఎస్సీ,ఎస్టీ యువతకు స్వయం ఉపాధి మార్గాలను దెబ్బతీశారు. టిడిపి అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను బలోపేతం చేసి గతంలో మాదిరిగా విరివిగా సబ్సిడీలు అందజేస్తాం. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి అమలుచేసిన పథకాలను పునరుద్దరిస్తాం. అంబేద్కర్ స్టడీసర్కిళ్లు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలను అధికారంలోకి వచ్చాక అమలుచేస్తాం. ఎస్సీ, ఎస్టీ చిన్నపరిశ్రమ దారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తాం. మీ సంక్షేమం కోసం పాటుపడే చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

యువనేతను కలిసి సమస్యలు విన్నవించిన ముస్లింలు

అనంతపురం పవర్ హౌస్ సర్కిల్ లో ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చట్టపరంగా రక్షణ కల్పించాలి. ముస్లిం మైనారిటీలు వివక్షకు గురికాకుండా ప్రత్యేక అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి. దుల్హన్ పథకాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలుచేయాలి. ఆ పథకం కింద ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.50వేల నుంచి రూ.1లక్షకు పెంచాలి. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువత ఉపాధికి 50శాతం సబ్సిడీపై రుణాలు అందించాలి. మైనారిటీ ముస్లిం విద్యార్థులకు గతంలో మాదిరిగా విదేశీవిద్య పథకాన్ని అమలుచేయాలి. మౌజమ్, ఇమామ్ లకు ఇస్తున్న గౌరవవేతనాలను పెంచాలి. ముస్లిం మైనారిటీల కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి, విరివిగా రుణాలివ్వాలి. ముస్లిం మైనారిటీల కోసం ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటుచేయాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా గత నాలుగేళ్లుగా ముస్లిం మైనారిటీలపై వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయి. మైనారిటీలకు చెందాల్సిన రూ.5,500  కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10మంది మైనారిటీలు హత్యకు గురికాగా, 40మందిపై దాడులు జరిగాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తాం. మైనారిటీల స్వావలంబనకు ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి ఆర్థికంగా చేయూతనిస్తాం. రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలకు ఎటువంటి కొర్రీలు లేకుండా అమలుచేస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు

అనంతపురం బసవన్న గుడి వద్ద అనంతపురం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నివంచారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించాలి. ఆర్యవైశ్యులకు జనాభా ప్రాతిపదికను జిల్లాకొక ఎమ్మెల్యే సీటు కేటాయించాలి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నివారణకు కఠినచర్యలు తీసుకోవాలి. పేద ఆర్యవైశ్యులకు వ్యాపారాలు చేసుకునేందుకు కార్పొరేషన్ ద్వారా రుణసౌకర్యం కల్పించాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదివరకెన్నడూ లేనివిధంగా ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు వైశ్యులు హత్యకు గురికాగా, 37చోట్ల దాడులు జరిగాయి. వైసీపీ అధికారంలో వచ్చాక ఆరుగురు ఆర్యవైశ్యులు హత్యకు గురికాగా, 37 ప్రాంతాల్లో దాడులు జరిగాయి.  వైసిపి అరాచకాన్ని ప్రశ్నించిన సుబ్బారావుగుప్తాపై ఒంగోలులో కేసు బనాయించి జైలులో పెట్టారు. ఇటీవల తెనాలిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోని ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన కౌన్సిలర్ యుగంధర్ పై దాడికి తెగబడ్డారు.  ఆర్యవైశ్య సామాజికవర్గ ప్రముఖుడు డూండీ రాకేష్ పై పలు తప్పుడు కేసులు నమోదుచేయడమేగాక తెనాలి, బంగారుపాళ్యం ప్రాంతాల్లో దాడిచేసి కొట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై దాడుల నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటాం. జె-ట్యాక్స్ బెడద లేకుండా స్వేచ్చగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు కల్పిస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ ను బలోపేతం చేసి వ్యాపారానికి రుణాలు మంజూరుచేస్తాం.

యువనేతను కలిసిన కురుబ సామాజికవర్గీయులు

అనంతపురం విజయ క్లాత్ సెంటర్ లో అనంతపురం జిల్లా కురుబ సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు. రాష్ట్రంలో 40లక్షల మంది జనాభా ఉన్న కురుబ సామాజికవర్గీయులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. జనాభా ప్రాతిపదికన మాకు ఎంపి, ఎమ్మెల్యే టిక్కెట్లు, నామినేటెడ్ పదవులు కేటాయించాలి. గొర్రెల లోన్లు, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. కురుబ కళాకారులు, గొరవయ్యలకు గౌరవవేతనం అందజేయాలి. కురుబల కులదైవం బీరప్పస్వామికి పూజాధికాలు చేసే గుడికట్ల స్వాములకు గౌరవవేతనం కల్పించాలి. కురుబ యువతీయువకుల స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు, విద్యారుణాలు మంజూరుచేయాలి. కురుబల ప్రధాన వృత్తి అయిన కమ్మెళ్లనేతకు అధునాతన యంత్ర పరికరాలు సబ్సిడీపై అందించాలి. ఎస్సీ రిజర్వేషన్ గెజిట్ లో ఉన్న మాదాసి కురువ, మాదారి కురువ సామాజికవర్గీయులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరులు, గొర్రెలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కురుబలు, గొర్రెల సంఘాలకు విరివిగా గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేసి ఆదుకోవాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో బలహీనవర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ బిసిలకు తీరని ద్రోహం చేశారు. గత నాలుగేళ్లలో రూ.75వేల కోట్ల బిసి సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. రాష్ట్రవ్యాప్తంగా బిసిలపై వైసీపీ ప్రభుత్వంలో 26వేలకుపైగా తప్పడు కేసులు నమోదుచేసి వేధింపులకు గురిచేశారు. బిసి సామాజికవర్గ ప్రముఖులు అచ్చెన్న, యనమల, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర వంటివారిపై తప్పుడు కేసులు నమోదుచేసి ఇబ్బందులకు గురిచేశారు. ఎన్టీఆర్ హయాంలో గొర్రెల మేపుకు కేటాయించిన పచ్చిక బయళ్లను వైసిపి నేతలు కబ్జాచేసి జీవనోపాధికి దూరం చేశారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ ను 10శాతం తగ్గించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,800 పదవులను దూరంచేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కురుబ కార్పొరేషన్ ద్వారా గొర్రెల కొనుగోలుకు  4లక్షల రూపాయల వ్యక్తిగత సబ్సిడీ రుణాలను అందజేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక కురుబ కార్పొరేషన్ ను బలోపేతం చేసి దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం. టిడిపి హయాంలో నిర్మాణం చేపట్టి వైసిపి అధికారంలోకి వచ్చాక నిలిపివేసి కురుబ కమ్యూనిటీ హాలు భవనాల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. గొర్రెలకు తక్కువ ప్రీమియంపై ఇన్సూరెన్స్ సౌకర్యం, గొర్రల కాపరులకు చంద్రన్న బీమా అమలుచేస్తాం.

యువనేతను కలిసి సమస్యలు విన్నవించిన మేదర సామాజికవర్గీయులు

అనంతపురం సూర్యనగర్ లో మేదర సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మేదర్లు వెదురు సాగుచేసుకోవడానికి 5ఎకరాల భూమి కేటాయించాలి. సామాజిక పరంగా వెనుకబడిన మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి. వెదురు సొసైటీలను పునరుద్దరించి, వెదురు కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వాలి. మేదర్లు తయారుచేసిన విసనకర్రలు, తడికలు, అల్లిన వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో వైసీపీ బిసిల వెన్నెముక విరిచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెదురుసొసైటీలను పునరుద్దరించి వెదురుకొనుగోలుకు సబ్సిడీలు అందజేస్తాం. మేదర్లు వస్తువులను విక్రయించుకునేందుకు ఎగ్జిబిషన్లలో స్టాళ్లు కేటాయిస్తాం. మేదర్లు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.

లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన నాయీబ్రాహ్మణులు

అనంతపురం సప్తగిరి సర్కిల్ లో ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సేవాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. క్షౌరవృత్తిదారులు, వాయిద్య కళాకారుల్లో 45ఏళ్లు నిండినవారికి పింఛను మంజూరు చేయాలి. అనంతపురం అర్బన్ పరిధిలో నాయీబ్రాహ్మణుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 20సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలి. నాయీబ్రాహ్మణులు హెయిర్ సెలూన్లు ఏర్పాటుచేసుకునేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. ప్రముఖ దేవాలయాల్లో పనిచేసే క్షురకులను పర్మినెంట్ చేయాలి. అనంతపురం జిల్లాలో పంచాయితీలు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సుల్లో నాయీబ్రాహ్మణులకు షాపులు కేటాయించాలి. నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా 500 యూనిట్ల విద్యుత్ కేటాయించాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

క్షౌరవృత్తిదారులు, నాయీబ్రాహ్మణులకు పరికరాల కొనుగోలు, సెలూన్ల ఏర్పాటుకు విరివిగా సబ్సిడీరుణాలు మంజూరు చేస్తాం. అవకాశమున్న చోట్ల పంచాయితీ, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సుల్లో షాపులు కేటాయిస్తాం. నాయీబ్రాహ్మణులకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి  చేయూతనిస్తాం.

యువనేతను కలిసిన దూదేకుల సామాజికవర్గీయులు

అనంతపురం నూర్ బాషా ఫంక్షన్ హాలు వద్ద దూదేకుల సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా 20లక్షలమంది దూదేకుల సామాజికవర్గీయులు విద్య, రాజకీయ రంగాలతోపాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మైనారిటీలకు అమలయ్యే అన్ని పథకాలను వర్తింపజేయాలి. మైనారిటీ విద్యాసంస్థల్లో మైనారిటీ విద్యార్థుల మాదిరిగానే దూదేకులకు అవకాశం కల్పించాలి. దూదేకులకు చట్టసభల్లో అవకాశం కల్పించి రాజకీయంగా ప్రోత్సహించాలి. దూదేకులను బిసి బి నుంచి బిసి ఈ కేటగిరిలో చేర్చాలి. దూదేకులు సమాజంలో అవమానాలకు గురికాకుండా ప్రత్యేక చట్టం తేవాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

దూదేకుల రాజకీయ, సామాజిక, ఆర్థికాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషిచేస్తుంది. దూదేకుల విద్యార్థులకు మైనారిటీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే అవకాశం కల్పిస్తాం. దూదేకుల యువత స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందజేస్తాం.తరచూ ఇబ్బందులకు గురికాకుండా శాశ్వత కులధృవీకరణ పత్రాలు జారీచేస్తాం.

యువనేతను కలిసిన బలిజ సామాజికవర్గీయులు

అనంతపురం ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ వద్ద రాయలసీమ బలిజ మహాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. సామాజికంగా వెనుకబడిన బలిజ, కాపు, ఒంటరి, తెలగలను బిసి జాబితాలో చేర్చాలి. అనంతపురం జిల్లాలో బలిజలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలి. రాయలసీమలో ప్రత్యేకించి బలిజ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ఆదుకోవాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

కాపులు, బలిజలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే. నిమ్మకాయల చినరాజప్పకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాం. తొలిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి 5ఏళ్లలో రూ.3,100 కోట్లు ఖర్చుచేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. కాపు విద్యార్థులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే అవకాశం కల్పించింది కూడా టిడిపి ప్రభుత్వమే. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బలిజ కాపుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తాం.

అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద యువనేతను కలిసిన స్థానికులు

అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద నగర ప్రముఖులు యువనేతను కలసి సంఘీభావం తెలిపారు. అనంతరం స్థానిక సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతపురం నగరంలో 9లక్షలమంది జనాభా నివసిస్తున్నారు. భారీవర్షాలు వచ్చినపుడు మురుగునీరంతా రోడ్లపైనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. టిడిపి అధికారంలోకి ఉన్నపుడు నగరంలో రూ.400 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజికి ఆమోదం కూడా లభించింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఫైలు మరుగునపడిపోయింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

టిడిపి ప్రభుత్వ హయాంలో సుమారు రూ.3వేల కోట్ల స్మార్ట్ సిటీ నిధుల ద్వారా రాష్ట్రంలోని ప్రధాన నగరాలను అందంగా తీర్చిదిద్దాం. అనంతపురం అండర్ గ్రౌండ్ డ్రైనేజికి గత ప్రభుత్వంలో ఆమోదం పొందిన రూ.400 కోట్లను తెచ్చుకోలేని దద్దమ్మలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల నిధులను దారిమళ్లించి పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దివాలాస్థితికి చేర్చారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా కనీసం రోడ్లు, వీధిదీపాలు వేసే దిక్కుకూడా లేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను బలోపేతం చేసి పట్టణాల అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషిచేస్తాం. అనంతపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

యువనేతను కలిసిన రుద్రంపేట వాసులు

అనంతపురం బైపాస్ రోడ్డులో రుద్రంపేట వాసులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. అనంతపురం బైపాస్ గుండా కర్నాటక, తెలంగాణా, తమిళనాడుకు చెందిన వాహనాల రద్దీ వల్ల నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్య నివారణకు అనంతపురానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించండి. కక్కలపల్లి నుంచి రుద్రంపేట పంచాయితీ మీదుగా అజాద్ నగర్, 6వరోడ్డు, రంగస్వామి నగర్, రజాక్ నగర్ తదితర కాలనీలు వర్షాల సమయంలో నీటమునుగుతున్నాయి. నగరంలోని వంకను  విస్తరింపజేసి కాల్వలకు ఇరువైపులా సైడ్ వాల్స్ నిర్మాణం చేపట్టండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వమే రూ.7,880 కోట్లరూపాయల స్థానిక సంస్థల నిధులను కొట్టేసింది. వివిధ గ్రామాల్లో గనులద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన రాయల్టీని కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో పంచాయితీల్లో కనీసం కరెంటు బిల్లులు కట్టేందుకు కూడా నిధుల్లేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ గ్రామాల్లో సౌకర్యాల కల్పనపై లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పంచాయితీలను బలోపేతం చేస్తాం. రుద్రంపేట వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తాం.

Also, read this blog: Nara Lokesh’s Path to Achieving Success in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *