తంబళ్లపల్లి నియోజకవర్గంలో లోకేష్ కు నీరాజనాలు! దారిపొడవునా సమస్యలు విన్నవించిన ప్రజలు నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత
తంబళ్లపల్లి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై పోరుసాగిస్తూ యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 42వరోజు (మంగళవారం) తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలికారు. అడుగడుగునా యువత, విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కంటేవారిపల్లి విడిది కేంద్ర నుండి మంగళవారం ప్రారంభమైన యువగళం పాదయాత్ర మొగసాలమర్రి, కుమ్మరపల్లి, ఉలవలవాల్లపల్లి, నాయినబావిపల్లి, గుట్టపాలెం మీదుగా విడిదికేంద్రానికి చేరుకుంది. మద్దయ్యప్పగారిపల్లిలోని న్యూమల్బరీ నర్సరీ వద్ద బీసీలు, మహిళలతో యువనేత ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన పాదయాత్రలో భాగంగా ఉలవాళ్లపల్లి టమోటా రైతులతో మాట్లాడి సాగులో పడుతున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధరల గురించి అడిగి తెలుసుకున్నారు, కుమ్మరపల్లిలో పాడి రైతులతో మాట్లాడి వారి సాదకబాధలు విన్నారు. అందరి సమస్యలను ఓపిగ్గా వింటున్న యువనేత లోకేష్ రాబోయేది చంద్రన్న నేతృత్వంలో ప్రజాప్రభుత్వమేనని, అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ఉద్యోగాలు లేకనే నా కొడుకు వాలంటీరుగా చేస్తున్నాడు! -చంద్రగిరి ఆదినారాయణ, కుమ్మరపల్లి
ఉద్యోగాలు లేకపోవడం వల్ల నా కొడుకు నాగేష్ వాలంటీరుగా చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం లేదు. నేను రెండు సీమఆవులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. పాల ధర కూడా అంతంతమాత్రంగానే ఉంది. లీటరు రూ.28 కంటే ఎక్కువ ధరకు కొనడం లేదు. 25 సెంట్లు పొలం కొని దానిలో గడ్జి జొన్న నాటుకుని ఆవుల్ని మేపుకుంటున్నాం. సబ్సీడీలో గడ్డి, దాణా ఇస్తే బాగుంటుంది..కానీ అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. మమ్మల్ని పెద్దిరెడ్డి డైరీ వాళ్లు పాలు పోయమన్నారు..నేను వైసీపీ కానీ పెద్దిరెడ్డి డెయిరీకి పాలు పోయను.
మట్టి మాఫీయాతో ఇబ్బందులు పడుతున్నాం! – వై.ప్రేమ్ కుమార్, ఇటుకబట్టీ కూలీ, గుట్టమీద హరిజనవాడ
ఇటుకబట్టీలో ఆలిమగలం రోజంతా కష్టపడితే రూ.800 కూలీ వస్తుంది. ఇద్దరం కలసి ట్రక్కు మట్టిని తొక్కాలి. రోజుమొత్తం తొక్కితేకానీ ట్రక్కు మట్టిని తొక్కగలం. గతంలో ట్రక్కు మట్టి రూ.250 నుండి రూ.300 లోపు ఉండేది. ఇప్పుడు మాఫియా వల్ల మట్టి దొరక్క ఇటుకలు తయారు చేయడం కష్టంగా ఉంది. మట్టి అందుబాటులో ఉన్నా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి రావడం వల్ల ఓనర్లు ముందుకు రావడం లేదు. దీంతో అప్పుడప్పుడు కూలీ లేక మేము ఇబ్బంది పడుతున్నాము. మట్టిఖర్చులు పెరగడం వల్ల ఇటుక రేటు పెరిగి కొనేవాళ్లు తక్కువయ్యారు. దీని వల్ల కూడా ఇటుక అమ్ముడుపోవడం లేదు. దీంతో పని దొరక్కుండా పోతోంది.
దళారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు! -మామిటి రమణప్ప, టమోటారైతు, పామూరివారిపల్లి.
ఎకరాకు రూ.1.60లక్షలు ఖర్చుపెట్టి టమోటా సాగు చేశాను. రూ.40 వేలు మాత్రమే రాబడి వచ్చింది. టమోటా ధర రోజురోజుకూ పడిపోతోంది. నకిలీ నారు, నకిలీ పురుగు మందుల వలన తీవ్రంగా నష్టపోతున్నాం. పురుగుమందులు సరిగా పనిచేయక కాయల్లో పుచ్చుపడుతోంది. వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. నకిలీ విత్తనాల వల్ల కాయ రంగు రావడం లేదు. దళారీలు మమ్మల్ని దోచుకుంటున్నారు. ఒక్కో బాక్సు టమోటాలకు రవాణా రూ.18 చెల్లించాలి. టమోటా క్రేట్ అద్దె రూ.7లు, బాక్సు దించినందుకు రూపాయి కూలీ చెల్లించాలి. వందకు 10 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడి నుండి మేము పది బాక్సులు తీసుకెళ్తే అక్కడ 8 బాక్సులకు బాక్సులకు మాత్రమే లెక్కకడతారు. రవాణా ఖర్చు, మండీ బాడిగ, దించిన కూలీల ఖర్చు భారంగా మారాయి. జాక్ పాట్ భారం కూడా రైతే భరించాలి. టమోటాలు కోత కూలీ రూ.300 ఇవ్వాలి. ఇవన్నీ పోగా మిగిల్తే మా చేతికి డబ్బులు వస్తాయి..లేదంటే అక్కడే పడేసి వస్తాం. వైసిపి ప్రభుత్వం వస్తే టొమాటో ప్రాసెసింగ్ యూనిట్లు పెడతారని హామీ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం అన్నారు. టొమాటో రైతుకి ఉన్న కష్టాలను పట్టించుకోవడమే లేదు. డ్రిప్ ఇరిగేషన్ కు ఎటువంటి సబ్సిడీ రావడం లేదు. వైసిపి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. సాస్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరోజీలు ఇక్కడికి తెస్తే పుణ్యం చేసుకున్న వాళ్లు అవుతారు.
నారా లోకేష్ స్పందిస్తూ….
టొమాటో రైతుల్ని జగన్ మోసం చేశారు. కచప్, గిచప్ ఫ్యాక్టరీలు పెడతానని మోసం చేసారు. కోల్డ్ స్టోరేజ్ లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ జగన్ నిలబెట్టుకోలేదు. మదనపల్లి టొమాటో మార్కెట్ ని దత్తత తీసుకుంటా అని హామీ ఇచ్చాను. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే టమాటో రైతులు పడుతున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ కోసం సబ్సిడీ ఇస్తాం. పెట్టుబడి తగ్గించేలా టొమాటో నారు నుండి పురుగుల మందుల వరకూ నాణ్యత తో పాటు తక్కువ ధరకు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టొమాటో రైతు కు మద్దతు ధర కల్పిస్తాం.
కొండంత హామీలు… చెవిలో పువ్వులు! ఇదే ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరుటిడిపి వచ్చాక చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంచుతాం బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు అందజేస్తాం వడ్డెర్లు, కురబలకు క్వారీలు, పచ్చికబయళ్లు కేటాయిస్తాం ఎన్నికల్లో అక్రమాలను ప్రశ్నిస్తే రాళ్లతో కొడతారా? అధికారంలోకి వచ్చేది మేమే… రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
తంబళ్లపల్లి: ఎన్నికల సమయంలో ఓట్లకోసం కొండంత హామీలు ఇచ్చి… అధికారంలోకి వచ్చాక చెవిలో పువ్వులు పెట్టడం ముఖ్యమంత్రి జగన్ నైజమని, ఆయన మాయమాటలు నమ్మి రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు మోసపోయారని టిడిపి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మద్దప్పగారిపల్లిలో బీసీలతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ…. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ప్రశ్నించిన వారి వాహనాలు ధ్వంసం చేసి, టిడిపినేతలను రాళ్లతో కొట్టారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే…ఖచ్చితం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం. బీసీలపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 వేల కేసులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 వేలమంది బీసీలపై కేసులు పెట్టింది.ప్రజల తరపున పోరాడుతున్నందుకు నాపై 20 దొంగ కేసులు పట్టారు. కేసులకు ఎవరూ భయపడొద్దు…దొంగ కేసులకు గురైన వారిపై కేసులు ఎత్తేస్తాం. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటాం.
తగ్గించిన బిసి రిజర్వేషన్లను పునరుద్దరిస్తాం!
రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. జగన్ రెడ్డి బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి, 16వేల పోస్టులకు ఎసరు పెట్టారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది ఎన్టీఆర్ వచ్చాకే. 2019కి ముందు బీసీలకు పెద్దపీట వేస్తామని జగన్ రెడ్డి అన్నాడు..కానీ రిజర్వేషన్లు తగ్గించారు. మీ రిజర్వేషన్ల కోసం పోరాడింది టీడీపీనే. TDP అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో స్థానిక సంస్థల్లో మళ్లీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి రాష్ట్రంలో అసలు ఉద్యోగాలు ఇచ్చారా.? టీడీపీ హయాంలో కార్పొరేషన్ ద్వారా లక్షలాదిమందికి స్వయం ఉపాధి కల్పించాం. బీసీ జనగణన జరగాలని పార్లమెంట్ లో టీడీపీ పోరాడింది. కేంద్ర స్థాయిలో బీసీలకు ఒక శాఖ ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. రాజకీయం, ఆర్థికంగా పైకితెచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. బీసీలు యేటా మేము బీసీలం అని నిరూపించుకోవాలా.? మేము అధికారంలోకి వచ్చాక ఫోనులో మీకు శాశ్వత పరిష్కారంగా కుల సర్టిఫికేట్లు అందిస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి యేడాదిలోనే ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు కూడా అట్రాసిటీ తీసుకొస్తాం. మా బీసీల జోలికి రావాలంటే భయపడాలి. వేధింపులకు గురైన బిసి బాధితులకు అయ్యే లీగల్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఏపీలో పేదరికం ఉండకూడదు. పేదరికం లేని రాష్ట్రంగా మేము తీర్చిదిద్దుతాం.
వడ్డెర సోదరులకు క్వారీలు అప్పగిస్తాం!
వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీనే. అనంతపురం జిల్లాలో వడ్డెరలకు ఎన్టీఆర్ క్వారీలు కేటాయించారు. కానీ పాపాల పెద్దిరెడ్డి వాటిని లాక్కున్నారు. అధికారంలోకి వచ్చాక వడ్డెర సోదరులకు క్వారీలు అప్పగిస్తాం. మరో యేడాది మీరంతా ఓపిక పట్టండి..జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. కురబలకు ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీనే. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చాం. టీడీపీ చేసిన మంచి పనులు మర్చిపోతున్నారు. కురబలకు జగన్ రెడ్డి ఎన్ని నిధులు ఇచ్చారు? కమ్యునిటీ భవనాల నిర్మాణం నాకు వదిలేయండి. గొర్రెల పెంపకాన్ని గతంలో ప్రోత్సహించాం. పేదరికం నుండి కురబలను బయటకు తీయాలి. గొర్రెలు మేసే భూముల్ని వైసీపీ నేతలు లాక్కున్నారు. అధికారంలోకి వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుని కురబలకు కేటాయిస్తాం.
రజకులను పదవులిచ్చింది టిడిపినే!
ఏపీ చరిత్రలో రజకులకు మొదటి సారి ఎమ్మెల్సీ ఇచ్చింది టీడీపీనే. దోబీ ఘాట్ లు కట్టేందుకు నిధులు. రూ.30 కోట్లు కేటాయించాం. ఆదరణ -2 కింద మీరు 10 శాతం డబ్బులు కట్టారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని తిరిగివ్వలేదు. తిరుపతి దేవస్థానంలో బట్టలు ఉతికేందుకు అవకాశం కల్పించాలని రజకులు అడిగారు..దానికోసం ప్రయత్నిస్తాం. శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ అనే రజక మహిళను అవమానించి..తన బూట్లు నాకాలని ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి. రజక మహిళను అవమానిస్తే రజక సంఘాలు ఎందుకు స్పందించడం లేదు.? అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం.
సత్యపాల్ నివేదికతో వాల్మీకిలకు న్యాయం చేస్తాం
వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని కమిటీ వేసింది టీడీపీనే. కానీ ప్రభుత్వం మారింది..ఈ జగన్ పట్టించుకోలేదు. జగన్ హామీ ఇచ్చి మాట తప్పి..మడమ తిప్పాడు. సత్యపాల్ కమిటీ నివేదిక ప్రకారం వాల్మీకీలను బీసీల్లో చేర్చాలని కేంద్రానికి పంపుతాం. విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం. మీకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది.? విశ్వబ్రాహ్మణులు సభలో అడుగుపెట్టే బాధ్యత నేను తీసుకుంటాం. ఉపకులాల వారీగా బీసీలను విభజించి రాజకీయంగా జగన్ రెడ్డి వాడుకున్నారు. మేము సాధికార కమిటీలు వేశాం.. రాజకీయంగా మేము ప్రోత్సహిస్తాం.
నాయకుల తయారీ ఫ్యాక్టరీ టిడిపి
తెలుగుదేశంపార్టీ నాయకులను పెద్ద ఫ్యాక్టరీ. శాసనమండలి, శాసనసభ, లోక్ సభకు ఎంతో మంది బీసీలను పంపింది టీడీపీనే. యాదవులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించింది చంద్రబాబే. తుడా, టీటీడీ చైర్మన్లను యాదవులకే ఇచ్చాం. మన జిల్లాలో యాదవులను ఎమ్మెల్యే చేసిన ఘనత టీడీపీదే. యాదవులు కూడా ఆలోచించాలి. హామీ లిచ్చిన జగన్ ..యాదవులకు ఏం చేశాడు.?
మదనపల్లి కేంద్రంగా బిసి స్టడీ సర్కిల్
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్టడీ సర్కిల్, బెస్ట్ అవెయిలబుల్, విదేశీ విద్యను తీసుకొచ్చాం..కానీ జగన్ రెడ్డి రద్దు చేశారు. మదనపల్లి కేంద్రంగా స్టడీ సర్కిల్, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. మదనపల్లి జిల్లాగా ఈ సీఎం చేయలేదు. మేము వచ్చాక మదనపల్లి కేంద్రంగా జిల్లా చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఈ ప్రభుత్వం వచ్చాక స్కూళ్ల విలీనం చేయడం వల్ల విద్యార్థుల సంఖ్యను తగ్గింది.
ఎక్కడ చూసినా పిఎల్ ఆర్ కంపెనీ లారీలే!
ఈ ఉమ్మడి జిల్లాలో పీఎల్ఆర్ పేరుతో పాపాల పెద్దిరెడ్డి లారీలు మాత్రమే తిరుగుతున్నాయి. పాడి రైతుల రక్తం తాగుతున్నారు. ఇక ఈ ప్రభుత్వం పోతుందని తెలిసి ఎంత దొరికితే అంత దోచుకుంటున్నారు. ఏ కొండ కొట్టినా పాపాల పెద్దిరెడ్డిదైన పీఎల్ఆర్ సంస్థ పేరు వినబడుతోంది. పుంగనూరులో 13 కి.మీలకు 32 కల్వర్టులు కట్టారు. జగన్ రెడ్డి ఇసుక ద్వారా రూ.3 కోట్లు రోజూ సంపాదిస్తున్నారు. ట్రక్కు ఇసుక వెయ్యి ఉన్నప్పుడు టీడీపీ దోచుకుంటుందన్నాడు..ఇప్పుడు రూ.6 వేలు ఉంది..ఎవరు దోచుకుంటున్నారు?
చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంచుతాం!
భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదు. ఇసుక ధర, భారతీ సిమెంట్ ధర పెరిగాయి. రూ.150లు భారతీ సిమెంట్ ధర పెరిగింది. ప్రభుత్వం రోడ్లు, భవనాలు నిర్మించడం లేదు. దీంతో కార్మికులకు పని దొరక్క అప్పులతో 60 మంది చనిపోయారు. అధికారంలోకి వచ్చాక ప్రమాదాల్లో చనిపోయిన వారికి రూ.10 లక్షలు చంద్రన్న బీమా అందిస్తాం. భవన నిర్మాణ కార్మికులుగా సగర కులం వాళ్లు మిగిలిపోవడం కాదు..మీకున్న బండ్లు, వాహనాలనే ప్రభుత్వ పనుల్లో వినియోగించాలి..ఆ విధంగా మేము ప్రయత్నిస్తాం.
217 జిఓతో మత్స్యకారుల పొట్టగొట్టిన జగన్
217 జిఓతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల పొట్టగొట్టారు. తరతరాలుగా చేపలుపడుతున్న చెరువులను వైసీపీ నేతలు, వాళ్ల బంధువులకు అప్పగిస్తున్నారు. సబ్సీడీతో బోట్లు, వలలు ఇవ్వడం లేదు. ఫైబర్ పడవులు ఇస్తామని జగన్ మత్య్సకారులకు హామీ ఇచ్చారు..కానీ ఇవ్వలేదు. మత్య్సకారులను తప్పనిసరిగా మేము ఆదుకుంటాం. రూ.964 కోట్లు చంద్రబాబు ఖర్చు చేసి ఆదరణ ద్వారా బీసీలకు పనిముట్లు అందించాం. ఆదరణ ద్వారా మళ్లీ మెరుగైన పనిముట్లు అందిస్తాం. శ్లాబులు మార్చడం వల్ల విద్యుత్ బిల్లు పెరుగుతోంది. రజకులు వృత్తి పరంగా వాడే వాషింగ్ మెషిన్లకు శ్లాబులు సవరించి విద్యుత్ బిల్లు తగ్గేలా చేస్తాం.
బీసీ సామాజికవర్గీయుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:
సదాశివ (కురబ సంఘం): మా కురబలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. కురబలు గతంలో గొర్రొలు మేపుకునేవారు. ఇప్పుడు పానీపూరీ బండ్లు పెట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక జనాభా ఉండే సెంటర్లలో బండ్లు పెట్టుకోవడానికి స్థలం కేటాయించాలి. తంబళ్లపల్లిలోని విశ్వం కాలేజీ వెనక 20 సెంట్ల స్థలం ఉంది. మీ ప్రభుత్వం వచ్చాక ఆ స్థలంలో బిల్డింగ్ కట్టించాలి. కురబలను ఆదుకుంది టీడీపీయే.
భాస్కర్ నాయుడు (పాలిఏకర): వైసీపీ వాళ్లు మమ్మల్ని బీసీల్లో చేర్చామని చెప్తున్నా..సర్టిఫికేట్లు సరిగా ఇవ్వడం లేదు. సీమలో 15 లక్షల జనాభా ఉన్నారు. మాకు చట్టసభలో అవకాశం, కార్పొరేషన్ లో నిధులు కేటాయించాలి. బీసీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. బీసీలపై అట్రాసిటీ కేసులు లేకుండా చేయండి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా మాకు కూడా అట్రాసిటీ అవకాశం కల్పించాలి. రాయలసీమలో మాత్రమే మాకు బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు..దాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలి.
నాగమల్లప్ప, గూడుపల్లి (వడ్డెర): వడ్డెర్లకు సరిగా ఫించన్ రావడం లేదు. ప్రమాదాల్లో చనిపోతే రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలి.
వడ్డెర సంఘం: గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు. కొత్తకోటలో వడ్డెర భవనానికి టీడీపీ ప్రభుత్వంలో స్థలం కేటాయించారు. కానీ వైసీపీ వచ్చాక ఆ స్థలాన్ని గుంజుకున్నారు. మాకు బీసీ కార్పొరేషన్ పున:రుద్ధరణ చేసి, రుణాలు మంజూరు చేయాలి.
రజక సంఘం : రజకులకు గతంలో వాషింగ్ మెషిన్లు ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చాక రజకులకు మీరు ఏం చేస్తారు.?
వాల్మీకీ సంఘం: వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని పోరాడుతున్నాం. తప్పని సరిగా మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలి
విశ్వబ్రాహ్మణ: మా కులం వాల్లకు చంద్రబాబు ఆదరణ ద్వారా పనిముట్లు ఇచ్చారు. రాష్ట్రంలో 24 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పనిముట్లు ఏమీ ఇవ్వడం లేదు. కార్పొరేషన్ ద్వారా మాకు ఏమీ చేయలేదు.
యాదవ సంఘం: నిరుపేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి. యాదవులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయించడం లేదు.
సగర సంఘం: 50 ఏళ్లు వచ్చే సరికి మోకాళ్లు అరిగిపోయి పని చేయలేకపోతున్నాం. సంచార జాతులగా ఉన్న మమ్మల్ని బీసీ-డి నుండి బసీ-ఏ లోకి మార్చాలి. కాంట్రాక్టు పనుల్లో భాగస్వామ్యం చేయాలి.
మత్య్సకార సంఘం: మేము చేపలమ్ముకుని జీవనం సాగిస్తాం. గత ప్రభుత్వంలో 70 శాతం సబ్సీడీతో వలలు, బోట్లు, ఇతర పనిముట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వం 217 జీవో తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.
రద్దుచేసిన పెన్షన్లు పునరుద్దరిస్తాం!
ఇప్పటికే 6లక్షల పెన్షన్లను వివిధ కారణాలు చూపి జగన్ సర్కార్ కట్ చేసింది. చంద్రబాబు పాలనలో పెన్షన్ ను రూ.200 నుండి రూ.2,000లకు పెంచారు. పెన్షన్ పెంపు పై చంద్రబాబు 2014ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా పెంచారు. జగన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు పెన్షన్ ను రూ.3వేలకు పెంచుతానని హామీ ఇచ్చి ఇప్పటికి 4దశల్లో కేవలం రూ.750మాత్రమే పెంచాడు. జగన్ రెడ్డి పాలనలో అన్యాయంగా పెన్షన్ కోల్పోయిన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్లు ఇస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. ఉద్యోగాల భర్తీ విషయంలో వైసీపీ సర్కార్ విఫలమైంది. అధికారంలోకి వస్తే 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చాడు. ప్రతియేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు అడిగిన యువకులను అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నాడు. చంద్రబాబు సీఎంగా ఉండగా 32వేల ప్రభుత్వ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ఇది నా హామీ. మొదటి జాబ్ క్యాలెండర్ 2025జనవరిలో ఇస్తున్నాం.
అధికారంలోకి వచ్చాక వలసలను నివారిస్తాం!
చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రైవేటు రంగంలో 40వేల పరిశ్రమలు తెచ్చి సుమారు 5.30లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ విషయాన్ని వైసీపీ అసెంబ్లీలో ఒప్పుకుంది. చంద్రబాబు పాలనలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో వెతికితే ఏపీ అని సమాధానం వచ్చేది. వైసీపీ చేతకాని తనం వల్ల ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఫలితంగా యువతకు ఉద్యోగాలు లేవు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రం యువత పక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లకుండా చూస్తాం. పక్క రాష్ట్రం వాళ్లే మన రాష్ట్రానికి ఉద్యోగాల కోసం వచ్చేలా పెట్టుబడులు తెచ్చి, ఉద్యోగాలు సృష్టిస్తాం. జగన్ పాలనలో స్వయం ఉపాధిని పూర్తిగా చంపేశారు. కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మొత్తం నిలిపేశారు. ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రిని ఉద్యోగాలు అడిగితే కోడి, గుడ్డు అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. యువతను గందరగోళంలోకి నెడుతున్నాడు. జగన్ రెడ్డి మరోసారి సీఎం అయితే ఐటీ చదువుకున్నవాళ్లంతా ఉపాధి కూలీల మాదిరి రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తాం.
స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తాం
మహిళలకు స్వయం ఉపాధికి చంద్రబాబు పెద్దపీట వేశారు. గతంలో కుట్టు మిషన్లను కూడా అందించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధి కార్యక్రమాలతో పాటు, కొన్ని కంపెనీల్లో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలను ఆదుకుంటాం. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. చంద్రబాబు సీఎం అయ్యాక పన్నులను తగ్గించి, నిత్యావసరాల ధరలను తగ్గిస్తాం. కేరళ రాష్ట్రం ధరల తగ్గింపునకు రూ.2వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేసింది. ఆ తరహాలో నిత్యావసరాల ధరల తగ్గింపుకు చర్యలు తీసుకుంటాం. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు బాధలు పెరిగాయి… మీ బాధలు పోవాలంటే…చంద్రబాబు సీఎం కావాలి.
వైసిపి పాలనలో మహిళలకు కరువైన రక్షణ
వైసీపీ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి పాలనలో 900మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఒక్కరికి కూడా దిశచట్టం ప్రకారం శిక్షలు పడలేదు. కానీ దిశచట్టం, యాప్ అంటూ జగన్ సర్కార్ ప్రచారం ఊదరగొడుతోంది. ఏపీలో గత మూడేళ్లలో 52వేల మంది మహిళలపై దాడులు జరిగాయని కేంద్రం నివేదికలు చెబుతున్నాయి. జగన్ రెడ్డి పాలనలో మహిళల అభద్రతకు ఈ గణాంకాలు నిదర్శనం.
అభహస్తం నిధులను దోచుకున్న జగన్
వైసీపీ పేద డ్వాక్రామహిళల అభయహస్తం డబ్బులు రూ.2,200కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ డబ్బులను రికవరీ చేసి, మీకు అందేలా చూస్తాం. మద్యంపై జగన్ రెడ్డి రూ.25వేల కోట్లు అప్పులు చేశాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత నీచానికి పాల్పడలేదు. చంద్రబాబు పాలనలో 130 సంక్షేమ కార్యక్రమాలను పేదవారికోసం అమలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగిన వాడిని నమ్మారు…అతను అధికారంలోకి వచ్చాక 100సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. చంద్రబాబు పాలనలో ఏనాడూ ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. కరెంటు ఛార్జీలు పెంచలేదు. పేదవాడికి పట్టెడన్నం మూడు పూటలా పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లు పెడితే వాటిని కూడా జగన్ రెడ్డి మూసేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను అన్నింటినీ పేదవాళ్లకు అందుబాటులోకి తెస్తాం.
డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి ఆదుకుంది చంద్రబాబే!
రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి ఆదుకుంది చంద్రబాబునాయుడు. చంద్రబాబు పాలనలో 90శాతం సబ్సిడీపై డ్రిప్ ఇచ్చారు. రైతులను ఆదుకున్నారు. జగన్ సీఎం అయ్యాక డ్రిప్ ను పూర్తిగా రద్దు చేసి రైతులను నాశనం చేస్తున్నాడు. రైతులేని రాజ్యంగా ఏపీని చేస్తున్నాడు. రైతులెవరూ ఆ మీటర్లను అంగీకరిస్తూ సంతకాలు పెట్టొద్దు. ఎదురు తిరగండి. మీకు మేం అండగా నిలబడతాం. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు గతంలో అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తాం. రైతు పండించిన పంటలకు గిట్టుబటు ధరలను అందిస్తాం.
మహిళలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
సర్పాజ్,తంబళ్లపల్లి: నా భర్తను పోలీసులు అరెస్టు చేసి కొట్టడం వల్ల ఆయన వికలాంగుడు అయ్యాడు. అతన్ని రుయాలో చూపించుకుంటున్నాను. సరైన వైద్యం అందడం లేదు. నా భర్త కాలు తీసేయాలని వైద్యులు చెబుతున్నారు. నా కుటుంబాన్ని పోషించేవారు లేరు. నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. వైసీపీ పాలనలో మేం రోడ్డున పడ్డాం. మీరే మమ్మల్ని ఆదుకోవాలి.
సిద్దమ్మ,కోసువారిపల్లి: పంచాయతీ ఎన్నికలు జరిగిన నాటి నుండి నన్ను డ్వాక్రా బుక్ కీపర్ గా వైసీపీ నాయకులు తొలగించారు. డ్వాక్రా సభ్యులంతా నేనే కావాలని కోరి సంతాకాలు పెట్టినా నాకు ఉద్యోగం లేకుండా చేసి వేధిస్తున్నారు.
నారాయణమ్మ,గట్టు గ్రామం: నా వయస్సు 70సంవత్సరాలు. నన్ను చూసేందుకు ఎవరూ లేరు. ప్రభుత్వం కనీసం పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. మీరే నన్ను ఆదుకోవాలి.
అర్చన, గుర్రంకొండ: రోజుకు 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాలేజీలకు వెళుతున్నాం. చదువుకున్నవాళ్లం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం. మాకు ఉద్యోగాలు ఇచ్చే విషయమై మీరైనా చర్యలు తీసుకోండి.
దీపిక, రెడ్డికోట: మేం డిగ్రీ చదువుతున్నాం. మా చదువులు పూర్తయ్యాక మాకు ఉద్యోగాలు వస్తాయా?
లక్ష్మి, గట్టుగ్రామం: డిగ్రీ చదివే విద్యార్థులకు అందుబాటులో కాలేజీలు లేవు, హాస్టళ్లు లేవు. వాటిని ఏర్పాటు చేయాలి. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టే చర్యలను మీరు అధికారంలోకి వచ్చాక తీసుకోవాలి.
కూసాలపల్లి గ్రామ మహిళ: 25ఏళ్లుగా మేం అభయహస్తం కట్టాం. మాకు 60సంవత్సరాలు దాటినా మేం కట్టిన ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. మా డబ్బులను ప్రభుత్వం దోచుకుంది. మా డబ్బులు మాకు ఇప్పించండి బాబు.
కోసువారిపల్లి గ్రామమహిళ: నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ నాకు మెంటల్ అని తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకులు రాయించారు. నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పిచ్చిపిచ్చిగా పెంచిన వైసీపీ నాయకులకు పిచ్చిపట్టిందా? ప్రశ్నించే నాకు పిచ్చిపట్టిందా? అనే అనుమానం ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మహిళలకు న్యాయం చేయాలి.
ఉమాదేవి,ముతకపల్లి ఎంపీటీసీ: 25ఏళ్లుగా మాకు రేషన్ షాపు ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేశారు. నా భర్త కాంట్రాక్టు పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
సునీత, కోసువారిపాలెం: పీపీహెచ్చ పైపును రూ.200 నుండి రూ.900కి పెంచేశారు. డ్రిప్ ఇరిగేషన్ నిలిపేశారు. పొలం మొత్తానికి కాకుండా సగం డ్రిప్ మాత్రమే ఇస్తామని వైసీపీ నాయకులు, అధికారులు చెబుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలి.
రాణి, తంబళ్లపల్లి: నేను టైలరింగ్ చేస్తున్నాను. చాలా మంది టైలరింగ్ నేర్చుకున్నారు. కానీ వారికి కుట్టు మిషన్ కొనుక్కునే స్థోమత లేక ఖాళీగా ఉన్నారు. మీరు మిషన్లు ఇచ్చి మహిళలకు స్వయం ఉపాధి అందించే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
గంగాదేవి, ములకలచెరువు: నా తండ్రి పంచాయతీలో సుదీర్ఘ కాలం పనిచేశాడు. కొంతకాలం క్రితం చనిపోయాడు. ఆ ఉద్యోగంలో నా తమ్ముడు పనిచేస్తున్నాడు. నా తమ్ముడిని అకారణంగా వైసీపీ నాయకులు తొలగించారు. మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
యువనేత లోకేష్ ను కలిసిన కుమ్మరిపల్లి వాసులు
పాదయాత్ర దారిలో కొత్తకోట మండలం బియ్యప్పగారిపల్లి గ్రామ పరిధిలోని కుమ్మరిపల్లి వాసులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో కరెంటు సక్రమంగా ఉండటం లేదు. అరకొర విద్యుత్ సరఫరా కారణంగా వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయాం. గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన నీరు,చెట్టు బిల్లులు ఇంతవరకు పడలేదు. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో వ్యవసాయంలో అప్పుల పాలవుతున్నాం. మా ప్రాంతంలో టమోటాలు అధికంగా పండిస్తున్నాం. నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజి సౌకర్యం కల్పించాలి. వ్యవసాయం గిట్టుబాటుగాక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యానవనపంటలను ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీలు అందించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
ఎన్నికల సమయంలో గిట్టుబాటు ధరలు, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పిన సిఎం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతలను గాలికొదిలేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతను కష్టాల నుంచి గట్టెక్కిస్తాం. టమోటారైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మదనపల్లిలో ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుచేస్తాం. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.
Also, read this blog: Another Remarkable Day of Yuvagalam by Nara Lokesh
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh