Nara Lokesh Yuvagalam Padayatra

తాడిపత్రి యువగళంలో జన ప్రభంభజనం! అడుగడుగునా నీరాజనాలు, నినాదాల హోరు జెసి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో అపూర్వస్వాగతం పాదయాత్ర పొడవునా వెల్లువెత్తిన సమస్యలు

తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. 67వరోజు యువగళం పాదయాత్ర ఉలికుంటపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి యువనేత నివాళులర్పించారు. సింగంగుట్టపల్లి వద్ద పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించగానే నియోజకవర్గ ఇన్ చార్జి జెసి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో వేలాది కార్యకర్తలు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. బాణాసంచా పేలుళ్లు, కార్యకర్తల కేరింతలకు ఆ ప్రాంతమంతా హోరెత్తింది. అడుగడుగునా యువనేతపై పూలవర్షం కురిపించారు. జై లోకేష్, జై టిడిపి నినాదాలతో హోరెత్తించారు.  పాదయాత్ర సింగంగుట్టపల్లి వద్ద అట్టహాసంగా తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. వేలాది మంది టీడీపీ కార్యకర్తలు యువనేత Nara Lokesh కు నీరాజనాలు పలికారు. వరదాయపల్లి వద్ద బెస్త సామాజికవర్గ ప్రజలు యువనేతకు తమ సమస్యలు చెప్పి, వినతిపత్రం ఇచ్చారు. పెదపప్పూరు శివార్లలో దూదేకుల సామాజికవర్గంతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. భోజన విరామం అనంతరం బుడగ జంగం/బేడ సామాజికవర్గీయులతో సమవేశమై సమస్యలు తెలుసుకున్నారు. పెదపప్పూరు పోలీస్ స్టేషన్ సమీపంలో రజకులను వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పెదపప్పూరు జెడ్పీ హైస్కూల్ వద్ద విద్యార్థులు, స్థానికులతో భేటీ అయ్యారు. పసలూరులో స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, రోడ్ల స్థితిగతులపై యువనేతకు వినతిపత్రం సమర్పించారు. పసలూరు వద్ద మీతూరు-మిడతూరు డబల్ రోడ్డు సమస్యలపై స్థానికులు యువనేతకు సమస్యలు వివరించారు. వేలాది ప్రజలు పాదయాత్రలో వెంట నడువగా ఉత్సాహంగా సాగిన యాత్ర… సాయంత్రం పసలూరులోని విడిది కేంద్రానికి చేరుకుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:

చెరువులో మట్టికి రూ.4వేలు వసూలు చేస్తున్నారు! – హరినాథ్, రైతు, రాయలచెరువు

పది ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నా. మద్దతు ధర పేరుకేగానీ ఎక్కడా కొనుగోలు చేయడం లేదు. పంట పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం లాభసాటిగా లేదు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పెద్దమ్మాయి గత ఏడాది డిగ్రీ పూర్తిచేసింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్ మెంట్ వస్తుందని చివరిదాకా ఎదురుచూశాం. ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో చివరకు ఫీజుతోపాటు మరో 5వేలరూపాయలు అదనంగా కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. పొలానికి రాయల చెరువు నుంచి మట్టి తెచ్చుకోవాలంటే టిప్పర్ కు రూ.4వేలు అడుగుతున్నారు. అదేమని అడిగినందుకు నాపై 3 కేసులు పెట్టారు. వైసిపి నాయకుల వ్యవహారం దుర్మార్గంగా ఉంది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు.

అరాచకాలు చూసి పరిశ్రమలు రావడంలేదు – విజయ్, నిరుద్యోగి, తాడిపత్రి.

నేను గత ఏడాది బి.టెక్ పూర్తిచేసి జాబ్ కోసం వెదుకుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక వైసిపినేతలు చీటికిమాటికీ గొడవలు పడటం, దాడులు చేస్తుండటంతో ఎక్కడా ప్రశాంతమైన వాతావరణం లేదు.  ఈ అరాచకం కారణంగా మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అడుగడగునా రాజకీయ జోక్యం మా ప్రాంతం వెనుకబాటుకు ప్రధాన కారణంగా ఉంది. చంద్రబాబునాయుడు సిఎం అయితేనే మళ్లీ రాయలసీమ ప్రాంతం వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. మాలాంటి వాళ్లు ఉద్యోగాల కోసం పొరుగురాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ధరలన్నీ పెరిగాయి, బతుకు భారంగా ఉంది! – బ్రహ్మయ్య, టైలర్, నాగులాపురం.

నేను టైలర్ వృత్తిలో ఉన్నాను. వ్యాపారాలు తగ్గిపోవడంతో గతంలో మాదిరి బట్టలు కుట్టించుకోవడం లేదు. గతంలో రోజుకు రూ.700 వరకు ఆదాయం వచ్చేది, ప్రస్తుతం 300 రావడమే గగనంగా ఉంది. పైగా ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయాయి. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. చాలీచాలనీ ఆదాయంతో బతుకుబండి లాగడం కష్టంగా ఉంది. రేషన్ బండి వచ్చినరోజు పనులన్నీ ఆపుకొని వెళ్లి రేషన్ తీసుకోవాలి. పొరపాటున ఆరోజు తీసుకోలేకపోతే మళ్లీ రేషన్ రాదు. గతంలో మాకు సమయం ఉన్నపుడు వెళ్లి తీసుకునే వాళ్లం. డీలర్ దగ్గర రేషన్ తీసుకునే విధానమే బాగుండేది.

ధ‌ర్మవ‌రం క‌బ్జాల్లో అబ్బాయి కేటు..! తాడిప‌త్రి దోపిడీల్లో బాబాయ్ సెప‌“రేటు“!

తాడిపత్రి మండలం పెదపప్పూరు వద్ద పెన్నానదిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలను చూసిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో అబ్బాయ్ ధ‌ర్మవ‌రం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కేటు క‌బ్జాలు చూశాం. తాడిప‌త్రి వ‌చ్చాం. అబ్బాయి ఏక్ నంబ‌ర్ సెటిల్మెంట్లు అయితే, ఇక్కడ బాబాయ్ ద‌స్ నంబ‌ర్ దందా. అబ్బాయి కేతిరెడ్డి కేటు అయితే బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో సెప‌“రేటు“. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం పెద్దపప్పూరు మండలం  పెన్నానదిలో పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ వద్ద సెల్ఫీ దిగాను. ఇసుక తవ్వకాలకు10 ఎకరాలు కేటాయిస్తే, అంతకంటే ఎన్నో రెట్ల అధిక విస్తీర్ణంలో ఇసుక తవ్వకాలు జరిపి బాబాయ్ గ్యాంగ్ కోట్లు దండుకుంటోంది. ఈ విషయం మీద పోరాటం చేసిన మాజీ ఎమ్యెల్యే జెసీ ప్రభాకర రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి హింసించారు.  ప్రతి రోజు ఈ రీచ్ నుండి సుమారుగా 150 టిప్పర్ల ఇసుక తరలిస్తోంది ఈ ముఠా. ధర్మవరం లో అబ్బాయ్ ఇసుక దోపిడిలో అడ్డంగా దొరికిపోవడంతో బాబాయ్ పెద్దారెడ్డి కాస్త జాగ్రత్త పడ్డాడు. నా పాదయాత్ర అటుగా వెళ్తుంది అని తెలిసి రెండు రోజుల క్రితమే రీచ్ బంద్ చేసి దుకాణం సర్దేసాడు. కానీ చేసిన ప్రకృతి విధ్వంసం ఎక్కడికి పోతుంది? ఇవిగో గుడ్ మార్నింగ్ కేటు బాబాయ్ ఇసుక మాఫియాకి సంబంధించిన ఆధారాలు అంటూ యువనేత వ్యాఖ్యానించారు.

భయం నుంచి బయటకొచ్చి అరాచకాలను ప్రశ్నించండి! నేను కేసులకు భయపడను… ప్రజలతరపున పోరాడుతూనే ఉంటా! దూదేకుల ముస్లింలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇస్తాం, దూదేకులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకుంటాం! దూదేకుల సామాజకవర్గీయుల సమావేశంలో యువనేత లోకేష్

తాడిపత్రి: వైసీపీ పనైపోయింది, జనం భయం నుంచి బయటకు వచ్చిన ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరులో దూదేకుల ముస్లిం సామాజికవర్గీయులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…గతంలో తాడిపత్రి ఎలా ఉండేది, ఇప్పుడు తాడిపత్రి లో ఏం జరుగుతుంది ఒక్క సారి ప్రజలు ఆలోచించాలి. నాపై 20కి పైగా కేసులు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి గారిపై 70 కేసులు ఉన్నాయి. అయినా ప్రజల తరపున పోరాడుతున్నాం. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లీం లను వేధించి చంపేస్తున్నారు. ఈ అరాచకాలను ఇంత ఎంతకాలం భరిస్తారు?

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్!

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. వక్ఫ్ భూములు కాపాడటానికి వక్ఫ్ బోర్డు కి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని వైసీపీమోసం చేశాడు.  ఎవరి హయాంలో మైనార్టీలకు న్యాయం జరిగిందో చర్చకు నేను సిద్దం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు సిద్దమా? దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. హజ్ హౌస్ లు నిర్మించింది టిడిపి. హజ్ యాత్రకు సహాయం చేసింది టిడిపి. ఉర్దూ యునివర్సిటీ ఏర్పాటు చేసింది. ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేసింది టిడిపి. రంజాన్ తోఫా ఇచ్చింది టిడిపి, దుల్హన్ పథకం, దుకాన్ మకాన్ కార్యక్రమం అమలు చేసింది టిడిపి. మసీదులు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు కేటాయించింది టిడిపి. ఖబర్ స్తాన్ లు అభివృద్ది చేసింది టిడిపి.

మైనారిటీలను మోసగించిన వైసిపి!

వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీలను మోసం చేసింది. ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. నూర్ బాషా ఫెడరేషన్ ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది టిడిపి. వైసిపి నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. ఒక్క రుణం ఇవ్వలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లీంలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం. నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లో దూదేకుల ముస్లీంలకి ప్రత్యేకంగా భూములు కేటాయిస్తాం. దూదేకుల ముస్లీంలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది టిడిపి. 1999లో నాగుల్ మీరా గారికి ఎమ్మెల్యే సీటు ఇచ్చాం. చమన్ గారికి జెడ్పీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చింది టిడిపి. నాగుల్ మీరా గారికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి ఇచ్చింది టిడిపి. 2024లో దూదేకుల ముస్లింలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా దూదేకుల ముస్లీంలకు పనిముట్లు అందజేస్తాం. ఆఖరికి శ్మశానం భూముల్ని కూడా వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లీం లు ఎక్కువ ఉండే గ్రామాల్లో ప్రత్యేక ఖబర్ స్తాన్ లు నిర్మిస్తాం. దూదేకుల ముస్లీం విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం.

తాడిపత్రిని అభివృద్ధి చేసింది జెసి కుటుంబమే!

తాడిపత్రి ని అద్భుతంగా అభివృద్ది చేసింది జేసీ కుటుంబం. గతంలో తాడిపత్రి వచ్చి మున్సిపల్ కార్యాలయం చూసినప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. కార్పొరేషన్ కి కూడా అంత అద్భుత భవనం ఉండదు. తాడిపత్రి కి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ ఇంకా ఏదో వస్తుంది అని ఆశించి పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. అప్పుడు అభివృద్ది లో నంబర్ 1 గా ఉన్న తాడిపత్రి ఇప్పుడు అవినీతి లో నంబర్ 1 గా ఉంది.

దూదేకుల ముస్లిం సామాజికవర్గీయులు మాట్లాడుతూ….

రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షలు మంది జనాభా ఉన్నా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. బిసి బి నుండి బిసి ఈ లోకి చేర్చాలి. అనేక వృత్తులు చేస్తున్నాం కానీ మాకు వైసిపి ప్రభుత్వం నుండి రుణాలు అందడం లేదు. మాకు కనీసం ఖబర్ స్తాన్ లు లేక ఇబ్బంది పడుతున్నాం. విద్యాసంస్థల్లో టిసిలు ఇచ్చే సమయంలో దూదేకుల ముస్లీం విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. ముస్లిం దూదేకుల అని సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. దూదేకుల ముస్లింలు ఆర్థికంగానూ, రాజకీయంగానూ వెనుకబడి ఉన్నారు. దూదేకుల ముస్లీంలకు వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. దూదేకుల ముస్లీం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కావడం లేదు, విదేశీ విద్య పథకం రద్దు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్దరించాలి.

దూదేకుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

యాడికుడి: మేం రాష్ట్రంలో 40లక్షల మంది ఉన్నారు. వివిధ రకాల వృత్తుల చేసుకుని బ్రతుకుతున్నాం. మమ్మల్ని బీసీ-బీ నుండి బీసీ-ఈ క్యాటగిరీలోకి మార్చాలి.

ఫక్రుద్దీన్: నేను వడ్రంగి పనిచేస్తున్నాను. అదేవిధంగా మాకు గతంలో వృత్తి పనిముట్లు సబ్సిడీలపై లభించేవి. నేడు అవేవీ లేవు. మా సామాజికవర్గంలో పెన్షన్లు కూడా అందడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.

నూర్ మహ్మద్: మేం చనిపోయాక మమ్మల్ని పూడ్చేందుకు శ్మశానవాటిక లేదు. మాకు శ్మశాన స్థలాన్ని కేటాయించి మాకు న్యాయం చేయాలి.

దస్తగిరి: విద్యావ్యవస్థలో మా కులం విద్యార్థులు ఓ సమస్యను ఎదుర్కొంటున్నారు. మా పిల్లల టీసీల్లో హిందూ దూదేకుల, ముస్లిం దూదేకుల అని రాస్తున్నారు. దీనివల్ల మా పిల్లలు విద్యారంగంలో కోల్పోతున్నాం. మా దూదేకుల కులానికి ముస్లిం దూదేకుల అని ఒకే విధంగా కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇప్పించాలి.

నాగరాజు, రిటైర్డ్ డీఎస్పీ: మా కులంలో ఎవరికీ చట్టసభల్లో ఇంత వరకు ప్రాతినిథ్యం లభించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా కులానికి చట్టసభల్లో ప్రాతినిథ్యం ఇప్పించాలి. మా దూదేకుల సామాజికవర్గానికి చెందిన 20లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో మా పిల్లలు విదేశాల్లో చదువుకున్నారు. నేడు స్కాలర్ షిప్ లు కూడా రావడం లేదు. మా పిల్లలకు స్కాలర్ షిప్ లు ఇప్పించి ఆదుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

శివానంద్: మా సామాజికవర్గంలో కొంత మంది పారిశ్రామికవేత్తలు, పాఠశాలలను నడిపేవారు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదు. మా ఫెడరేషన్ కు మీరు నిధులు కేటాయిస్తే, వాటిని మేం ఉపయోగించుకుని మా వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని, మరికొంత మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. పరిశ్రమలు పెట్టేందుకు 40శాతం సబ్సిడీలు ఇప్పించాలి. కోపరేటివ్ సొసైటీలో సభ్యులుగా ముస్లిములనే పెడుతున్నారు. కో ఆప్షన్ సభ్యులకు అవకాశాలు కల్పించాలి.

అధికారంలోకి వచ్చాక బేడ, బుడగ జంగాల సమస్య పరిష్కరిస్తాం ఎస్సీలకు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తాం -ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ హమీ

తాడిపత్రి: అధికారంలోకి వచ్చాక బేడ/బుడగ జంగాల సమస్యను పరిష్కరిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెదపప్పూరు శివార్లలో బేడ/ బుడగ జంగాల ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… బేడ/ బుడగ జంగాల కు గతంలో ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారు. కానీ 2008 లో 144 జీఓ తీసుకొచ్చి మీకు తీరని అన్యాయం చేశారు. మీ సమస్యలు తెలుసుకున్న తరువాత టిడిపి హయాంలో చంద్రబాబు గారు జేసీ మిశ్రా కమిషన్ వేసాం. 13 జిల్లాలో పర్యటించిన జేసీ మిశ్రా కమిషన్ బేడ/ బుడగ జంగాల కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. బేడ/ బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలనే రిపోర్ట్ ను టిడిపి ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈ లోపు బేడ/ బుడగ జంగాలకు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చంద్రబాబు గారు ఎస్సీలకు అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తానని వైసీపీ మిమ్మలని మోసం చేశారు. నాలుగేళ్లు బేడ/ బుడగ జంగాల ను గాలికి వదిలేసి ఇంకో కమిషన్ వేసి కాలయాపన చేస్తుంది వైసిపి ప్రభుత్వం. బేడ/ బుడగ జంగాల కు టిడిపి హయాంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను కూడా వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బేడ/ బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తాం. ఎస్సీలకు అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలు బేడ/ బుడగ జంగాల కు అమలు చేస్తాం. బేడ/ బుడగ జంగాల పిల్లల చదువుకు సహాయం అందిస్తాం.

బుడగ జంగాలు మాట్లాడుతూ….

2008లో వైఎస్ గారి హయాంలో 144 జీఓ తీసుకొచ్చి ఎస్సీల్లో ఉండే  మాకు సర్టిఫికేట్లు రాకుండా చేసి అన్యాయం చేశారు. ఎస్సీ సర్టిఫికేట్లు రాక మాకు ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వడం లేదు. ఏ వ్యాపారం చేసుకుందాం అన్నా రుణాలు కూడా ఇవ్వడం లేదు. సమాజం లో మాకు కనీస గౌరవం లేకుండా పోయింది. కుల ధృవీకరణ పత్రాలు లేక మేము నరకం అనుభవిస్తున్నాము. మా పిల్లలు చదువుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తాం అని వైసీపీ మమ్మలని మోసం చేశారు.

యువనేతను కలిసిన తబ్జుల, సింగనగుట్టపల్లె వాసులు

తాడిపత్రి నియోజకవర్గం, తబ్జుల, సింగనగుట్టపల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. చాగల్లు రిజర్వాయర్ వల్ల మా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. మా గ్రామాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ అండ్ ఆర్ పరిహారం నేటికీ రాలేదు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను కూడా వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఆర్ అండ్ ఆర్ పరిహారం, ఇంటి బిల్లులు ఇప్పించాలని కోరుతున్నాం. రిజర్వాయర్ లో తమ గ్రామం ముంపునకు గురైన నాటినుంచి నేటివరకు తబ్జుల గ్రామానికి శ్మశానం లేదు. అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరారు.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ….

చాగల్లు రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశంపార్టీ తీసుకుంటుంది. అధికారంలోకి వస్తే నెల రోజుల్లో పరిహారం ఇప్పిస్తామని చెప్పి వైసీపీ నాయకులు మొహం చాటేశారు. నాలుగేళ్లు గడిచినా ఎవ్వరూ మీ ముఖం కూడా చూడలేదు. మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చాగల్లు రిజర్వాయర్ బాధితులకు పరిహారం అందిస్తాం. TDP హయాంలో శ్మశానం లేని గ్రామాలకు భూమి కొనుగోలు చేసి స్మశాన వాటికలు ఏర్పాటు చేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అపార్టీ నేతలు స్మశానాలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక తబ్జుల గ్రామంలో శ్మశానవాటికను ఏర్పాటు చేస్తాం.

యువనేతను కలిసిన బెస్త సామాజికవర్గీయులు

తాడిపత్రి నియోజకవర్గం వరదాయపల్లెకి చెందిన బెస్త సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.  మా గ్రామంలో బెస్త సామాజికవర్గమంతా చేపలు పట్టడం కులవృత్తిగా చేసుకుని బ్రతుకుతున్నాం. చాగల్లు రిజర్వాయర్ లో 2010 నుండి చేపలు పట్టుకుని జీవిస్తున్నాం. టీడీపీ హయాంలో మాకు చెరువులు, రిజర్వాయర్లను మత్స్యకార సొసైటీలకు అందించి వేటకు అనుమతులిచ్చారు. చేపపిల్లలను సబ్సిడీపై ఇచ్చి చెరువుల్లో పెంచుకునేందుకు ప్రోత్సహించారు. వైసీపీ ప్రభుత్వం జీఓ:217 తెచ్చి మా పొట్టకొడుతున్నారు. సబ్సిడీపై చేపపిల్లలను వదలడం లేదు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, శింగమనల ఎమ్మెల్యే పద్మావతి, ఈ జిల్లా ఇన్చార్జ్ బొత్స సత్యనారాయణ అండ చూసుకుని పెదపప్పూరు వైసీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. చాగల్లు డ్యామ్ లో చేపలు పట్టేందుకు వెళుతుంటే చంపుతామని బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మత్స్యశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు కూడా మా సమస్యలపై స్పందించడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా చేపల వేట వృత్తికి ఇబ్బంది కలిగించే జీఓ 217ను రద్దు చేయాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వారిని చూసి కిందిస్థాయి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ:217ను రద్దు చేస్తాం. చెరువుల్లో పెంచుకునేందుకు చేప పిల్లలను సబ్సిడీపై అందిస్తాం. బెస్త సామాజికవర్గ అభివృద్ధికి సహకరిస్తాం.

యువనేతకు హిజ్రాల వినతిపత్రం

తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరులో హిజ్రాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు.  సమాజంలో మేం చాలా వివక్షకు గురవుతున్నాం. మాకు ఎటువంటి జీవనోపాధి లేదు, దారిద్ర్యంలో కూరుకుపోయాం. గత ప్రభుత్వం మాకు పెన్షన్ ఇచ్చేది. ఇళ్లు లేనివారికి స్థలాలు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మా పెన్షన్లు నిలిపేశారు. మాకు సొంత ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పునరుద్ధరించి, మాకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

హిజ్రాల సమస్యల్ని దేశంలో మొదటిసారిగా గుర్తించి పెన్షన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. 2018 జనవరిలో జీఓఎంఎస్-7 ద్వారా రాష్ట్రంలోని సుమారు 30వేల మంది హిజ్రాలకు పెన్షన్లు మంజూరు చేశారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక హిజ్రాలకు పెన్షన్లను పునరుద్ధరిస్తాం. హిజ్రాలకు వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన సంక్షేమ పథకాలన్నీ పునఃప్రారంభిస్తాం. ఇళ్ల స్థలం, సొంత ఇళ్లు లేనివారికి తప్పకుండా ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తాం. టీడీపీ హయాంలో రాష్ట్ర బడ్జెట్లో హిజ్రాల సంక్షేమం కోసం రూ.20కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుది. స్వయం ఉపాధిని కోరుకునే హిజ్రాలను ప్రోత్సహిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

యువనేతను కలిసిన పెదపప్పూరు గ్రామస్తులు

తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. పెదపప్పూరు గ్రామం చుట్టుపక్కల మండలాలకు పెన్నానది నీరే జీవనాధారం. గత ప్రభుత్వం వరకు పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఇసుక రీచ్ పెట్టి ఇష్టారీతిన ఇసుక తవ్వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. నీటి వనరులు కూడా మా గ్రామానికి తగ్గిపోయి నీటి సమస్య ఏర్పడింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. పెన్నానది ఇసుక అక్రమాలను అరికట్టి, మాకు తాగునీటి కొరత లేకుండా చూడాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ….

వైసీపీ దోపిడీ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. రాజమండ్రి సీతానగరంలో ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు గుండు కొట్టించారు. మేం అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం. అక్రమాలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు నీటి కొరత లేకుండా సరైన సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ప్రతినిధులు

తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరులో జాతీయ చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి చేనేతలు ఎదుర్కొనే సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 40నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారు. నేతన్న నేస్తం కింద ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రూ.24వేలను రూ.50వేలకు పెంచాలి. చేనేతలు తయారు చేసిన వస్త్రాలకు మార్కెంటింగ్ సౌకర్యం కల్పించాలి. ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలి. చేనేత వస్త్రాలకు వాడే రసాయనాలపై జీఎస్టీని రద్దు చేయాలి. పవర్ లూమ్స్ చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. చేనేత కార్మిక కుటుంబాలకు రూ.10లక్షలు బీమా అందించాలి. మా సామాజికవర్గానికి 30 ఎమ్మెల్యే సీట్లు, ఒకరికి మంత్రి పదవి, నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి చేనేత రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఒక్క ధర్మవరంలోనే 55 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న చేనేతల కుటుంబాలను ఆడుకుంటాం. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తాం.  టీడీపీ పాలనలో చేనేతలకు ముడిసరుకు, రసాయనాలను ధరలు తగ్గించి ఆదుకున్నాం. చేనేతల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. చేనేతలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన చినపప్పూరు గ్రామస్తులు

తాడిపత్రి నియోజకవర్గం చినపప్పూరు గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యను యువనేత నారా లోకేష్ దృష్టికి తెచ్చారు. చినపప్పూరు వద్ద పెన్నానదిపై ఉన్న వంతెన పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాలు వచ్చిన సమయంలో వంతెనపై రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. గతేడాది కురిసిన వర్షాలకు వంతెన పూర్తిగా పాడైపోయింది. గతేడాది వరదల సమయంలో పెన్నానదిలో ఐదురుగు మరణించారు. పాడైపోయిన వంతెనను పునరుద్ధరించి మా గ్రామాన్ని ఆదుకోవాలి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, బ్రిడ్జిల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చినపప్పూరు పెన్నానదిపై వంతెనకు అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

యువనేతను కలిసిన పసలూరు గ్రామస్తులు

తాడిపత్రి నియోజకవర్గం పసలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు.  గత ప్రభుత్వంలో నీతూరు నుండి మిడుతూరు వరకు రెండు లైన్ల రోడ్డుకు నిధులు కేటాయించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ నిధులను రద్దు చేసింది. మాకు రోడ్డు సదుపాయం కల్పించాలని అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా గ్రామానికి రోడ్డు నిర్మించాలి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ….*

వైసీపీకి దాచుకోవడం, దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ రోడ్లపై లేదు. పనులు ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వం మారడంతో పనులు నిలచిపోయాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పసలూరు గ్రామస్తుల విజ్జప్తి మేరకు రోడ్డు నిర్మిస్తాం.

Also, read this blog: The Triumph of Nara Lokesh in Advancing to the Next Level of Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *