Nara Lokesh Yuvagalam padayatra

పోలవరం పూర్తిచేసేది, రిబ్బన్ కట్ చేసేది చంద్రబాబే! గోదావరి మిగులుజలాలను రాయలసీమకు తెస్తాం, టిడిపి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి రైతన్న ముఖంలో ఆనందం చూడటమే టిడిపి లక్ష్యం టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయం లాభసాటి చేస్తాం రైతులమోములో ఆనందం చూస్తేనే యాత్ర విజవంతమైనట్లు! ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను నిలదీయండి రైతన్నతో లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్

శింగనమల: పోలవరాన్ని 72శాతం పూర్తిచేసింది చంద్రబాబే… మిగిలింది కూడా పూర్తిచేసి రిబ్బన్ కట్ చేసేది కూడా చంద్రబాబు…. పోలవరం పూర్తిచేస్తానని చెప్పి వైసీపీ నాలుగుడేట్లు ఇచ్చారు, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు కదల్లేదు… వైసీపీ పని అయిపోయింది, వచ్చేది మనప్రభుత్వమే… గ్రావిటీద్వారా విశాఖకు, రాయలసీమకు నీళ్లిస్తామని టిడిపి యువనేత Nara Lokesh పేర్కొన్నారు. అనంతపురంజిల్లా, శింగనమల నియోజకవర్గం, జంబులదిన్నె కొట్టాల యువగళం క్యాంప్ సైట్ లో ‘‘రైతన్నతో లోకేష్’’ కార్యక్రమంలో యువనేత లోకేష్ వ్యవసాయరంగంపై తెలుగుదేశం పార్టీ విధివిధానాలను స్పష్టంగా అన్నదాతల ముందుంచారు.  జంబులదిన్నెలో చుట్టూ కొండలు, పంటపొలాల నడుమ కల్మషంలేని అన్నదాతలతో ఆహ్లాదకర వాతావరణంలో హలో లోకేష్ కార్యక్రమం కొనసాగింది.  హంద్రీనీవా మిగిలిన 10శాతం పనులు పూర్తిచేస్తాం, పోలవరం మిగులుజలాలను అందించి రాయలసీమ రైతులకు సాగునీరే గాకుండా ఇంటింటికీ తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టంచేశారు. టిడిపి అధికారంలోకి రాగానే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి రైతుల మోములో ఆనందం చూసినపుడే తన పాదయాత్ర విజయవంతమైనట్లుగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. అంతిమంగా రైతన్న ముఖంలో ఆనందం చూడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చింతపల్లి రామ్ ప్రసాద్ హోస్ట్ గా వ్యవహరించారు.

ప్రశ్న: మీకు రైతన్నతో లోకేష్ నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి?

లోకేష్: 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇరిగేషన్, ఇన్ పుట్ సబ్సిడీ పథకాలు ముందుతీసుకెళ్లారు. రూ.50వేలు రుణాన్ని ఒకే ఒక్క సంతకంతో రైతులకు రద్దు చేశారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తిచేశారు. రాయలసీమకు రూ.11,000కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుచేశారు. అనంతపురం అరటి పండు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందడం చంద్రబాబు చేసిన కృషి ఫలితమే. చంద్రబాబు పాలనకు ముందు కేజీకి రూ.6 వచ్చే అరటి పండుకు నేడు రూ.32వస్తోంది. దీనికి కారణం చంద్రబాబు. రాయలసీమ రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. TDP పాలనలో రైతులపై తలసరి అప్పు రూ.70వేలు ఉంటే నేడు వైసీపీ పాలనలో అది రూ.2.50లక్షలకు చేరింది. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వస్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వస్థానానికి ఏపీ వైసీపీ పాలనలో వెళ్లింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ‘‘రైతన్నతో లోకేష్’’ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతుల సమస్యలతో పాటు రైతులు వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలు, వాటిలో లాభసాటి విధానాలను కూడా తెలుసుకోవాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. మంచి నిర్ణయాలను రాష్ట్రమంతా అమలు చేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాలనేదే నా ఉద్దేశం. రైతన్న ఆనందంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే వ్యక్తిని నేను. రాష్ట్రంలో 70శాతం ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి అండగా నిలవడం నా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను.

ప్రశ్న: ఇప్పటికి మీరు 800కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు. ఈ ప్రయాణంలో రైతులను కలిసి అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు. వాటిలో మీ మనసును హత్తుకున్న విషయం ఏదైనా ఉందా?

లోకేష్: నా పాదయాత్రలో ఓ రైతును కలిసినపుడు అడిగాను. ఆ రైతు స్పందిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.12.5లక్షల అప్పులు చేయాల్సి వచ్చింది. ఎరువులు, పురుగుమందులు, పెట్టుబడులు పెరగడంవల్లే అప్పులపాలయ్యానన్నాడు. ఆరునెలల క్రితం ఆయన భార్య కూడా క్యాన్సర్ తో మరణించింది. ఆ బాధ ఒకవైపు, అప్పుల బాధ మరోవైపుతో సతమతమవుతూ  మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తే ఆత్మహత్యే శరణ్యమని చెప్పిన మాటలు నన్ను తీవ్రంగా కలచివేశాయి.

ప్రశ్న:నందమూరి తారకరామారావు వేషధారణలో ఓ సంపూర్ణ రైతు కనిపించారు. మీకు అలా ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఆ వస్త్రధారణ మీరు అవలంభిస్తారా?

లోకేష్:రైతులకు సంపూర్ణ న్యాయం చేసిన నాడు నేను ఖచ్చితంగా రైతన్న వస్త్రధారణ చేస్తాను. అప్పుడే నాకు పూర్తిగా సంతృప్తి కలుగుతుంది.

ప్రశ్న:అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తుల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అటువంటి వారిని మీరు అధికారంలోకి వస్తే ఎలా ఆదుకుంటారు?

లోకేష్:ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంటనష్టం ఖర్చులను చంద్రబాబు గతంలో రైతులకు ఇచ్చి ఆదుకున్నారు. వైసీపీ పాలనలో పంట బీమాలను పూర్తిగా రద్దు చేశారు. అన్నమయ్య జిల్లాలో భారీ వరదలు వచ్చి పంటలు నాశనమైతే కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా వెళ్లి రైతులను పరామర్శించలేదు. వారికి పంటనష్ట పరిహారాన్ని అందించలేదు. వైసీపీ పాలనలో 9 తుపాన్లు వచ్చాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు మాత్రం పరిహారం అరకొర అందాయి. రైతు భరోసా కేంద్రాలు రైతులను ఉద్ధరిస్తాయని చెబుతున్నారు..కానీ అవి ఎప్పుడు చూసినా మూతబడే ఉంటున్నాయి. కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. హుద్ హుద్ తుఫాను వచ్చిన సమయంలో చంద్రబాబు రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. రాయలసీమలో నీటి ట్యాంకర్ల ద్వారా నీరు అందించి వ్యవసాయానికి సహకరించిన చరిత్ర ఉంది. మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక గతంలో రైతులను ఎలా ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటాం.

ప్రశ్న: మీరే సొంతంగా వ్యవసాయం చేసి, ఇందులో ఉన్న కష్టసుఖాలు తెలుసుకోవాలనే కోరిక ఏమైనా ఉందా?

లోకేష్: రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు నేను తట్టుకోలేను. రైతులు పడిన, పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న తర్వాత రైతుల పట్ల ప్రేమ మరింత పెరిగింది. వారికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి, అధికారంలోకి వచ్చాక రైతన్నలకు వెన్నుముకలా నిలబడాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను.

ప్రశ్న:మీరు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోలేకపోతే వాటిని భవిష్యత్తులో మేం నిలదీయవచ్చా?

లోకేష్:రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వారిని ఎలా ఆదుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నారు. సీఎం అయిన వెంటనే త్వరితగతిన రైతుల సమస్యల్ని పరిష్కరిస్తారనే విషయాన్ని రాసిపెట్టుకోండి. నేను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నన్ను నిలదీయవచ్చు. అదేవిధంగా హామీలను నెరవేరిస్తే మీరే నన్ను అభినందించండి.

ప్రశ్న:ఈ క్రాప్ విధానం వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?

లోకేష్:నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆదుకోకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు వైసీపీ పాలనలో పెరిగిపోయాయి. రైతులు నష్టపోయే పథకాలతో సంబంధం లేకుండా రైతులను గతంలో ఏ విధంగా ఆదుకున్నామో ఆ విధానాలను పునరుద్ధరిస్తాం. రైతుల అప్పులభారాన్ని కూడా తగ్గిస్తాం.

ప్రశ్న:మీరు రైతు కాదు. వ్యవసాయం తెలియదు. రైతుల సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు?

లోకేష్:నా పాదయాత్రలో రైతులు పడుతున్న ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా రైతుల సమస్యలపై అనేక కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకున్నాం. రైతులకు లాభాలు వచ్చే విధానాలను అమలు చేసి రైతులను ఆత్మహత్యల బారి నుండి బయటకి తెచ్చి ఆదుకుంటాం. మంత్రిగా ఉన్నప్పుడు రైతుల పంటలను ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మార్కెటింగ్ చేసి వారికి లాభాలు తెచ్చిన అనుభవం ఉంది. మిగిలిన పంటలను కూడా అదేవిధానంలో మార్కెటింగ్ చేస్తాం. రైతులను లాభాల బాటలో నడిపిస్తాం. హెరిటేజ్ కంపెనీ ద్వారా రైతులను నాకు నేరుగా సంబంధాలున్నాయి. వారి సమస్యలపైనా అవగాహన ఉంది. ఈ అనుభవాలన్నీ రైతులను ఆదుకునేందుకు నాకు ఉపయోగపడతాయి.

ప్రశ్న:దేవాన్ష్ వ్యవసాయం వైపు వస్తానంటే మీరు ప్రోత్సహిస్తారా?

లోకేష్:దేవాన్ష్ వ్యవసాయం చేస్తానంటే తప్పకుండా స్వాగతిస్తా, ప్రోత్సహిస్తా. కానీ నాకు ఉన్న అనుభవాలు దృష్ట్యా సలహాలు కూడా ఇస్తా. వ్యవసాయాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం నేర్పిస్తా. తండ్రిగా అది నా బాధ్యత.

ప్రశ్న:వ్యవసాయానికి టెక్నాలజీని ఎలా అనుసంధానం చేస్తారు?

లోకేష్:నేటి కాలంలో ఇంట్లో కూర్చుని బటన్ నొక్కితే అన్నీ మన కాళ్లదగ్గరకే వస్తున్నాయి. వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు, ట్రాక్టర్లు వంటి యంత్ర పరికరాలను కూడా బటన్ నొక్కి రైతుల ఇళ్లవద్దకే పంపేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయాన్ని టెక్నాలజీతో లాభసాటి చేసే విధానాలను అందుబాటులోకి తెస్తాం.

*వీడియో ద్వారా రైతులు అడిగిన ప్రశ్నలు*

‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వీడియో ద్వారా అడిగిన ప్రశ్నలకు యువనేత సమాధానాలు ఇచ్చారు’’.

ప్రశ్న:నా పేరు కాకుమాను శ్రీనివాస్. కొండేపి నియోజకవర్గం. వైసీపీ ప్రభుత్వం 2019లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కౌలురైతులకు అనేక హామీలిచ్చి మోసం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక కౌలురైతులను ఎలా ఆదుకుంటారో చెప్తారా?

లోకేష్: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కౌలురైతులకు అందడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక కౌలురైతులను ఆదుకునే ఓ కార్యాచరణను ప్రకటిస్తాం. ఇన్ పుట్ సబ్సిడీ మొదలు గిట్టుబాటు ధర కల్పించే వరకు అనేక అంశాల్లో కౌలురైతులను ఆదుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తాం. టీడీపీ పాలనలో రైతులను, కౌలురైతులను సమానంగా ఆదుకుంటాం.

ప్రశ్న:శ్రీనివాస్, ఇచ్ఛాపురం: మాకు ఇక్కడ నకిలీ విత్తనాలు ఇస్తున్నారు. పంట నష్టపోవడం వల్ల రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మంచి విత్తనాలు అందించి రైతుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా.

లోకేష్:తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండగా నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలను అరికడతాం. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటాం. విత్తనాలను టెస్టు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.

*సభకు వచ్చిన రైతుల అడిగిన ప్రశ్నలు*

ప్రశ్న:నా పేరు రమేష్. టమోటా, హార్టీ కల్చర్ పంటలకు సబ్సిడీలు ఇలా ఇస్తారు?

లోకేష్: టీడీపీ పాలనలో హార్టీకల్చర్ రైతులకు పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి కూలి ఖర్చులు తగ్గించాం. టమోటా ధరలు మార్కెట్లో ఉన్న హెచ్చు,తగ్గుల వల్ల అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. టమోటా రైతులను ఆదుకునేందుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏపీ నుండి రూ.70కోట్లు, కేంద్రం ఇచ్చిన రూ.40కోట్లుతో నిధులు ఖర్చు చేశాం. అక్కడితో ఆగకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక మదనపల్లిలో టమాటా కోల్డ్ స్టోరేజ్ ను నెలకొల్పి టమాటా రైతులను ఆదుకుంటాం. ఎరువులు, పురుగు మందుల ధరలు కూడా తగ్గాల్సి ఉంది. అప్పుడే రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. వైసీపీ ప్రభుత్వం పెంచిన పన్నులు తగ్గించి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి అన్ని ధరలను తగ్గిస్తాం. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. రైతులు కూడా తమకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతున్నా.

ప్రశ్న:రమేష్, పుట్లూరు: మా ప్రాంతంలో చీనీ రైతులు అధికంగా ఉన్నారు. ధరల స్థిరీకరణ నిధిపెట్టి మాకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చి మోసం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆదుకుంటారా?

లోకేష్:తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండగా ధరల స్థిరీకరణ నిధి లేకుండానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఆదుకున్న మాదిరి రైతులను ఆదుకుంటాం. చీనీ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా నెలకొల్పి మీ పంటలను ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపి మీకు లాభాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న:నాగయ్య, గుంతకల్లు: గత పాలనలో హంద్రీనీవా ద్వారా మా చెరువులకు నీళ్లు వచ్చేవి. నేడు రావడం లేదు. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక మాకు నీరు ఇస్తారా?

లోకేష్:హంద్రీనీవా ప్రాజెక్టును 90శాతం చంద్రబాబు పూర్తి చేశారు. మిగిలిన 10శాతాన్ని కూడా మేం పూర్తిచేసి మీ చెరువులకు నీరు అందిస్తాం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పుష్కలంగా సాగునీరు అందించారు. పోలవరాన్ని కూడా చంద్రబాబు 72శాతం పూర్తిచేశారు. దాన్ని కూడా పూర్తిచేసి గోదావరి నీళ్లను రాయలసీమకు తెస్తాం. పోలవరంపై వైసీపీ ఇప్పటికి నాలుగు తేదీలు మార్చారు. అయినా పని పూర్తవలేదు. పోలవరాన్ని పూర్తిచేయలేరు. హంద్రీనీవా, పోలవరాన్ని మేం పూర్తిచేసి రాయలసీమలో గడప గడపకు తాగునీటిని అందిస్తాం.

ప్రశ్న:మీరు వ్యవసాయ మంత్రి అయితే రైతులకు ఏం చేస్తారు?

లోకేష్:వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తాం. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, యంత్రపరికరాలు, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై రైతులకు అందిస్తా. అనంతపురం అరటి పంట విదేశాలకు ఏ విధంగా ఎగుమతి చేసి రైతులకు లాభాలు తెచ్చామో, మిగిలిన పంటలను కూడా మార్కెటింగ్ చేసి రైతులకు లాభాలు తెచ్చే చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న:నరసింహులు, శింగనమల: మా పొలాల్లో బోర్లు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక బోర్లు వేస్తారా?

లోకేష్:గత పాలనలో ఎన్టీఆర్ జలసిరి ద్వారా రైతుల పొలాల్లో బోర్లు వేశాం. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ పథకం ద్వారా బోర్లు వేస్తాం.

ప్రశ్న:శ్రావణ్, శింగనమల: యువతను వ్యవసాయం వైపు తీసుకొచ్చేందుకు మీరు ఏం చేస్తారు?

లోకేష్:పాడి, పట్టు, ఆక్వా రంగాలను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తాం. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా పంటలను విదేశాలు, ఇతర రాష్ట్రాలకు మార్కెటింగ్ చేస్తాం. వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తాం. వ్యవసాయం, అనుబంధ రంగాలను మేం అధికంగా ప్రోత్సహించి యువతను వ్యవసాయరంగం వైపు ఆకర్షిస్తాం.

ప్రశ్న:కె.నాగరాజు, కళ్యాణదుర్గం: ఆర్బీకే కేంద్రాల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉండడం లేదు. డ్రిప్ కూడా రద్దు చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక సబ్సిడీపై డ్రిప్ ఇస్తారా?

లోకేష్:ఆర్బీకే కేంద్రాలు అలంకార కేంద్రాలుగా ఉన్నాయి. అవి ఎప్పుడు చూసినా తాళాలు వేసే ఉంటున్నాయి. మద్యం దుకాణాలు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఈ విధంగా వైసీపీ పరిపాలన కొనసాగుతోంది. గతంలో రైతులకు ఇచ్చిన విధంగానే సబ్సిడీపై డ్రిప్ ఇస్తాం.

ప్రశ్న: శ్రీధర్, ఉరవకొండ: మీరు ఎప్పుడైనా వ్యవసాయానికి, మట్టికి దగ్గరగా జీవించారా?

లోకేష్:రైతులకు, వ్యవసాయానికి దగ్గరగా ఉండేందుకే పాదయాత్ర చేస్తున్నా. పొలాల్లో పనిచేసే వారిని కలుసుకుంటున్నా. వారితో పాటు పనిలో పాలుపంచుకుంటూ వారి కష్టం విలువ తెలుసుకుంటున్నా.

ప్రశ్న:బాబురెడ్డి, తాడిపత్రి: మాకు గత పాలనలో అరటి, చీనీ మొక్కలు సబ్సిడీపై ఇచ్చేవారు. నేడు ఇవ్వడం లేదు. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇస్తారా?

లోకేష్:రైతులను ఆదుకోవడం, వారి ముఖంలో చిరునవ్వు చూడడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. గతంలో రైతులకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, సబ్సిడీ పథకాలు అన్నీ కొనసాగిస్తాం.

*ముగింపు సందర్భంగా యువనేత మాట్లాడుతూ…*

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు అందిస్తాం. పంట పెట్టుబడులు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు సబ్సిడీపై అందిస్తాం. అనంతపురంలో అరటి పంటను ఏవిధంగా విదేశాలకు పంపి లాభాలు వచ్చేలా చేశామో, మిగిలిన పంటలను కూడా అలాగే చేసి రైతులకు లాభాలు తెచ్చే ఏర్పాటు తెస్తాం. ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. రైతుముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా రైతు సంక్షేమ పాలన అందిస్తాం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి.

Also, read this blog: The Impressive Story of Lokesh’s Journey to Success in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *